పుట్టపర్తి టౌన్: రాప్తాడు నియోజకవర్గ ఎమ్మెల్యే పరిటాల సునీత తనయుడు, ధర్మవరం నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్ పరిటాల శ్రీరామ్ పేరు చెప్పి రూ.లక్షలు దోచేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలంటూ ఎస్పీ రత్నకు బాధితుడు లాలూనాయక్ ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఎస్పీని కలసి తన ఫిర్యాదును అందజేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. ‘మాది ముదిగుబ్బ మండలం పూజారి తండా. నా పేరు రమావత్ లాలూనాయక్. చదువులు పూర్తి చేసుకున్న నా కుమారుడు ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నాడు. నాతో పరిచయమున్న ముదిగుబ్బ మండలం పొడరాళ్లపల్లి గ్రామానికి చెందిన టీడీపీ నేత వెంకటనారాయణ ఓ రోజు నన్ను కలసి నా కుమారుడి ఉద్యోగం గురించి అడిగాడు. చాలా ప్రయత్నాలు చేస్తున్నా ఏ ఒక్కటీ దొరకలేదని అన్నా. అయితే తనకు పరిటాల శ్రీరామ్‌తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, శ్రీరామ్‌కు చెప్పి అనంతపురంలోని కలెక్టరేట్‌లో నీ కుమారుడికి కంప్యూటర్ ఆపరేటర్‌గా ఉద్యోగం ఇప్పిస్తానని అన్నాడు. మొదట నేను నమ్మలేదు. అయితే తన మాట శ్రీరామ్ జవదాటడంటూ నమ్మబలికాడు. ఉద్యోగం కావాలంటే రూ.3.50 లక్షలు ఇవ్వాలన్నాడు. దీంతో అతని మాటలు నమ్మి గత ఏడాది ఆగస్టులో రూ.3.50 లక్షలు ఇచ్చాను. నెలలు గడుస్తున్నా ఉద్యోగం కల్పించే విషయం గురించి ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. పలుమార్లు అడిగినా ఇదిగో... అదిగో అంటూ చెబుతూ వచ్చాడు. రెండు రోజుల క్రితం గట్టిగా నిలదీశా. ఉద్యోగం లేదు.... గిద్యోగం లేదు. డబ్బు కూడా వెనక్కు ఇవ్వను. నీ దిక్కున్న చోటుకెళ్లి చెప్పుకో. ఎక్కువ మాట్లాడితే అధికారంలో ఉన్నాం. పోలీసులకు చెప్పి నీ మీదే కేసు పెట్టిస్తా. కాదూకూడదంటావా శ్రీరామ్‌తో చెప్పి నిన్ను చంపిస్తా అంటూ బెదిరించాడు. అయ్యా.. నేను పేదోడిని నాకు న్యాయం చేయాలని ఎస్పీ ఎదుట మొరపెట్టుకున్నా. మేడమ్ స్పందించి న్యాయం చేస్తానని మాటిచ్చారు’ అంటూ వివరించాడు.
50 వినతులు
జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వివిధ సమస్యలపై 50 వినతులు అందాయి. ఎస్పీ రత్న స్వయంగా వినతులు స్వీకరించి బాధితులతో మాట్లాడారు. సమస్య తీవ్రత తెలుసుకుని చట్టపరిధిలోని అంశాలకు తక్షణ పరిష్కారం చూపాలని సంబంధిత ఎస్‌హెచ్‌ఓలను ఆదేశించారు. కార్యక్రమంలో డీఎస్పీలు ఆదినారాయణ, విజయ్‌కుమార్, లీగల్ అడ్వైజర్ సాయినాథ్‌రెడ్డి పాల్గొన్నారు.
ప్రజాసమస్యల పరిష్కార వేదికలో ఎస్పీకి బాధితుడి ఫిర్యాదు
ఉద్యోగ కల్పన పేరుతో ఘరానా మోసం
ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలి : ఎస్పీ
పరిటాల పేరు చెప్పి రూ.లక్షలు దోచేశాడు