
నాలుగైదు రోజుల్లో నైరుతి
అనంతపురం అగ్రికల్చర్: రైతన్నలకు వాతావరణశాఖ శుభవార్త చెప్పింది. గురువారం కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు నాలుగైదు రోజుల్లో ఉమ్మడి అనంతపురం జిల్లాతో పాటు రాష్ట్రమంతటా విస్తరించేందుకు అనుకూలమైన వాతావరణం ఉందని రేకులకుంట వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బి.సహదేవరెడ్డి, వాతావరణ విభాగం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ జి.నారాయణస్వామి తెలిపారు. ఈ మేరకు గురువారం వాతావరణ బులెటిన్ విడుదల చేశారు. మరోవైపు రాగల రెండు రోజులు ఉమ్మడి అనంతపురం జిల్లాలో పగటి ఉష్ణోగ్రతలు పెరిగే సూచనలు ఉన్నాయన్నారు. అయితే అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కూడా కురుస్తాయని పేర్కొన్నారు. కొన్ని ప్రాంతాల్లో 30 కిలోమీటర్ల మేర బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించారు.
మైనార్టీ గురుకుల పాఠశాల, కళాశాలల్లో నేరుగా ప్రవేశాలు
పరిగి: ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మైనార్టీ గురుకుల పాఠశాల, కళాశాలల్లో నేరుగా ప్రవేశానికి ముస్లిం మైనార్టీ విద్యార్థులు (బాల, బాలికలు) దరఖాస్తులు చేసుకోవాలని ఆ సంస్థ జిల్లా కోఆర్డినేటర్, ఏపీఆర్‌జేసీ కొడిగెనహళ్లి ప్రిన్సిపాల్ శ్రీనివాసరావు తెలిపారు. 2024–25 విద్యా సంవత్సరానికి 5, 6, 7, 8 తరగతులతో పాటు ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సరంలో చేరగోరే విద్యార్థులు ఎలాంటి ప్రవేశ రుసుము లేకుండా నేరుగా దరఖాస్తులు చేసుకోవచ్చన్నారు. అనంతపురం జిల్లా గార్లదిన్నె, కర్నూలు జిల్లాలో ఉన్న పాఠశాల, కళాశాలల్లో ప్రవేశానికి ఆసక్తి గల విద్యార్థులు ఆయా పాఠశాలలు, కళాశాలల ప్రధానాచార్యులను సంప్రదించవచ్చన్నారు. పూర్తి వివరాలకు ఏపీఆర్‌జేసీ (మైనార్టీ బాలురు) కర్నూలు 87126 25080, ఏపీఆర్‌ఎస్ (మైనార్టీ బాలురు) కర్నూలు 87126 25068, ఏపీఆర్‌ఎస్ (మైనార్టీ బాలికలు) కర్నూలు 87126 25070, ఏపీఆర్‌ఎస్ (మైనార్టీ బాలురు) గార్లదిన్నె 87126 25062 సెల్ నంబర్లను సంప్రదించాలన్నారు.
విత్తనం తీసుకొని పంట వేయకపోతే పథకాలు కట్
● జిల్లా వ్యవసాయాధికారి వైవీ సుబ్బారావు
నల్లమాడ: సబ్సిడీ విత్తన వేరుశనగ తీసుకొన్న రైతుల పేర్లు ఈ క్రాప్ బుకింగ్‌లో నమోదు కాని పక్షంలో వారి పేర్లను బ్లాక్ లిస్ట్‌లో ఉంచి ప్రభుత్వ పథకాలకు అనర్హులుగా పరిగణిస్తామని జిల్లా వ్యవసాయాధికారి వైవీ సుబ్బారావు హెచ్చరించారు. ప్రభుత్వ సబ్సిడీ వేరుశనగ విత్తన కాయలను ఎవరూ దుర్వినియోగం చేయకూడదన్నారు. మండలంలో విత్తన వేరుశనగ పంపిణీని గురువారం ఆయన పరిశీలించారు. వంకరకుంట నుంచి శీకివారిపల్లి వైపు వేరుశనగ బస్తాలతో వెళ్తున్న ఆటోను అడ్డగించి కాయలు ఎక్కడికి తీసుకెళ్తున్నదీ ఆరా తీశారు. ఒక రెవెన్యూ గ్రామం నుంచి ఇంకో రెవెన్యూ గ్రామానికి విత్తన కాయలు తీసుకెళ్లడం నిషేధమన్నారు. అనంతరం జిల్లా వ్యవసాయాధికారి రెడ్డిపల్లిలో వేరుశనగ పప్పు ఆడించే మిషన్ (గోదాము)లను తనిఖీ చేశారు. రైతుల నుంచి విత్తన వేరుశనగ కాయలు కొనుగోలు చేసినా, నిల్వ ఉంచినా కఠిన చర్యలు తప్పవని యజమానులను హెచ్చరించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి సుమతి పాల్గొన్నారు.
సబ్సిడీ కాయలు కొనుగోలు చేస్తే చర్యలు
పుట్టపర్తి అర్బన్: ప్రభుత్వం సబ్సిడీపై రైతులకు అందజేస్తున్న విత్తన వేరుశనగ కాయలను ఎవరైన కొనుగోలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా వ్యవసాయాధికారి సుబ్బారావు హెచ్చరించారు. గురువారం నల్లమాడ మండలం రెడ్డిపల్లి, ఓడీ చెరువు మండలం కొండకమర్ల గ్రామాల్లోని ప్రైవేటు వేరుశనగ మిల్లులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల నుంచి విత్తన కాయలు కొనుగోలు చేస్తే మిల్లులు, వ్యాపారులపైనా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. విత్తన కాయలు నిలువ చేస్తే సీజ్ చేయడంతో పాటు సంబంధిత వ్యాపారిపై కేసులు నమోదు చేస్తామన్నారు. గురువారం జిల్లాలోని అన్ని రైతు భరోసా కేంద్రాల ద్వారా 11,821 మంది రైతులకు 8,863 క్వింటాళ్ల విత్తన వేరుశనగ కాయలను పంపిణీ చేశామన్నారు. విత్తన కాయలు నాణ్యంగా ఉన్నాయని, ఎక్కడైనా నాణ్యత లేకుంటే వెనక్కు ఇచ్చి మరో బస్తా తీసుకెళ్లచ్చన్నారు.

నాలుగైదు రోజుల్లో నైరుతి