
‘‘వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో రాజకీయం చేసే మగాళ్లు లేరు... అందుకే చాలా చోట్ల మహిళలకు టికెట్లు ఇస్తున్నారు’’ ఈ మాటలు అన్నది ఎవరో కాదు.. టీడీపీ ఎంపీ అభ్యర్థి బీకే పార్థసారథి. ఆయన మాటలను చూస్తేనే అర్థం చేసుకోవవచ్చు.. ఆ పార్టీలో మహిళలకు ఏమాత్రం గౌరవం ఉందో. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో మహిళలకు పెద్దపీట వేస్తుండటంతో జీర్ణించుకోలేని టీడీపీ పెద్దలు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు. హిందూపురం పార్లమెంటు టీడీపీ అభ్యర్థి బీకే పార్థసారథి చేసిన వ్యాఖ్యలపై మహిళలు, పలువురు ప్రజా ప్రతినిధులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.
సాక్షి, పుట్టపర్తి: గత టీడీపీ ప్రభుత్వ పాలనలో మహిళలపై అఘాయిత్యాలు, మహిళా అధికారులపై దురుసు ప్రవర్తన, దాడులను ఇంకా ఎవరూ మర్చిపోలేదు. మంత్రుల స్థాయి నుంచి వార్డు సభ్యుడు స్థాయి వరకు టీడీపీలో మహిళలపై చిన్నచూపు చూసే వాళ్లు ఉన్నారన్న విమర్శలున్నాయి. ఎక్కడో మారుమూల గ్రామాల్లో ఎన్నో ఏళ్లుగా రాజకీయ చైతన్యం లేని కుటుంబాలను సైతం పైకి తెచ్చిన ఘనత వైఎస్సార్‌సీపీకే దక్కుతుందని పలువురు పేర్కొన్నారు. వైఎస్సార్‌సీపీ హయంలో ఉమ్మడి జిల్లా జెడ్పీ చైర్మన్‌తో పాటు మున్సిపల్ చైర్‌పర్సన్లు, ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులు, సర్పంచ్‌లతో పాటు పలు నామినేటెడ్ పదవులు మహిళలకు ఇచ్చి.. పురుషులతో సమానంగా గౌరవం ఇస్తోంది. అందులోనూ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మహిళలే అధికంగా ఉండటం విశేషం. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా జిల్లాలో బీసీ కులాలకు చెందిన శాంతమ్మ (పార్లమెంటు అభ్యర్థి), దీపిక (హిందూపురం అసెంబ్లీ), ఉషశ్రీచరణ్ (పెనుకొండ అసెంబ్లీ) పోటీ చేసేందుకు వైఎస్సార్‌సీపీ అవకాశం కల్పించింది.
వైఎస్సార్‌సీపీ హయాంలో ఇలా...
● ఉమ్మడి జిల్లా జెడ్పీ చైర్‌పర్సన్‌గా బోయ గిరిజమ్మ కొనసాగుతున్నారు.
● కదిరి నియెజకవర్గంలోని ఆరు మండలాల్లో ఆరుగురు మహిళలు జెడ్పీటీసీ సభ్యులుగా ఉన్నారు. తనకల్లు ఎంపీపీగా మహిళే కొనసాగుతున్నారు. అలాగే కదిరి మున్సిపల్ చైర్‌పర్సన్‌గా మహిళ ఉండటంతో పాటు మరో 18 మంది మహిళలు కౌన్సిలర్లుగా కొనసాగుతున్నారు.
● పుట్టపర్తి నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో నాలుగు చోట్ల మహిళలు జెడ్పీటీసీ సభ్యులుగా ఉన్నారు. మూడు మండలాల్లో ఎంపీపీలుగా మహిళలు ఉన్నారు.
● హిందూపురం నియోజకవర్గంలోని మూడు మండలాల్లో ఎంపీపీలుగా మహిళలే ఉన్నారు. హిందూపురం మున్సిపల్ చైర్‌పర్సన్‌గా మహిళ కొనసాగుతున్నారు. మరో 14 స్థానాల్లో మహిళా కౌన్సిలర్లు ఉన్నారు.
● మడకశిర నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో ముగ్గురు జెడ్పీటీసీ సభ్యులు, ఇద్దరు ఎంపీపీలుగా మహిళలు ఉన్నారు. మడకశిర మున్సిపల్ చైర్‌పర్సన్‌గా కూడా మహిళకే అవకాశం ఇచ్చారు.
● పెనుకొండ నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో నాలుగు చోట్ల మహిళలే ఎంపీపీలుగా ఉన్నారు. మరో స్థానంలో జెడ్పీటీసీ సభ్యురాలిగా ఉన్నారు. మున్సిపాలిటీలో 10 మంది మహిళా కౌన్సిలర్లు ఉన్నారు.
● ధర్మవరం నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో నాలుగు చోట్ల ఎంపీపీలుగా మహిళలు ఉన్నారు. మరో రెండు చోట్ల జెడ్పీటీసీ సభ్యురాలిగా మహిళకు అవకాశం ఇచ్చారు. ధర్మవరం మున్సిపల్ చైర్‌పర్సన్‌గా మహిళ కొనసాగుతున్నారు. మరో 21 స్థానాల్లో మహిళా కౌన్సిలర్లు ఉన్నారు.
● రాప్తాడు నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో ఎంపీపీలుగా మహిళలు ఉండటం విశేషం.
సగానికి పైగా మహిళలకే..
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డాక వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో మహిళలకు పెద్దపీట వేశారు. జిల్లాలో 32 మండలాలు, ఆరు మున్సిపాలిటీలు ఉన్నాయి. ఇందులో నాలుగు మున్సిపాలిటీల్లో చైర్‌పర్సన్లుగా మహిళలు కొనసాగుతున్నారు. అదేవిధంగా 20 మండలాల్లో ఎంపీపీలుగా మహిళలు ఉన్నారు. మరో 16 మండలాల్లో జెడ్పీటీసీ సభ్యులుగా మహిళలకు అవకాశం ఇచ్చారు. అంతేకాకుండా వైస్ చైర్మన్లు, వార్డు సభ్యులు, వివిధ కార్పొరేషన్లకు డైరెక్టర్లుగా చాలామంది మహిళలకు పదవులు ఇచ్చి వైఎస్సార్‌సీపీ సమన్యాయం చేసింది.
టీడీపీలో కేవలం ఒకరిద్దరికే..
గత 2004 ఎన్నికల నుంచి హిందూపురం పార్లమెంటు రాజకీయాలను పరిశీలిస్తే.. కేవలం గోనుగుంట్ల జయమ్మ, పరిటాల సునీత మాత్రమే చట్టసభలకు పోటీ చేశారు. మరెవరికీ టీడీపీ అవకాశం ఇవ్వలేదు. రాానున్న ఎన్నికల్లో పరిటాల సునీతతో పాటు సవితకు అవకాశం ఇచ్చారు. 2019లో ఒక్క మహిళకు కూడా టీడీపీ టికెట్ ఇవ్వలేదు. అలాగే 2009, 2014లో కూడా పరిటాల సునీతకు మాత్రమే టికెట్ ఇచ్చారు. టీడీపీలో కేవలం పెత్తందార్లకే పెత్తనం కట్టబెడుతున్నారనేందుకు ఇదే నిదర్శనమన్న విమర్శలున్నాయి. తాజాగా బీకే చేసిన వ్యాఖ్యలు ఇందుకు అద్దం పడుతున్నాయి.
వైఎస్సార్‌సీపీతోనే చట్టసభలు,
నామినేటెడ్ పోస్టుల్లో పెద్దపీట
సగానికి పైగా సీట్లు
మహిళలకే కేటాయింపు
అందులో చాలా మంది
బీసీ, ఎస్సీ, మైనార్టీలే
మహిళలను చులకనగా చూస్తున్న టీడీపీ పెద్దలు
వైఎస్సార్‌సీపీలో మగాళ్లు లేక
మహిళలకు సీట్లు ఇస్తున్నారన్న
బీకే పార్థసారథి
పార్థసారథి వ్యాఖ్యలపై
మహిళల ధ్వజం