
పుట్టపర్తి అర్బన్: సత్యసాయి బాబా 98వ జయంత్యుత్సవాల్లో పాల్గొనేందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తొలిసారి పుట్టపర్తికి విచ్చేస్తున్న నేపథ్యంలో ఏర్పాట్లపై కలెక్టర్ అరుణ్‌బాబు, ఎస్పీ మాధవరెడ్డి సత్యసాయి ట్రస్ట్ ప్రతినిధులతో కలిసి అధికారులతో సమీక్షించారు. రాష్ట్రపతి పర్యటనలో ఎలాంటి తప్పులు దొర్లకూడదని కలెక్టర్ ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్, ఎస్పీ మాట్లాడుతూ... ఈనెల 22వ తేదీన ప్రశాంతి నిలయంలోని సాయికుల్వంత మందిరంలో జరగనున్న సత్యసాయి డీమ్డ్ యూనివర్సిటీ వార్షికోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొంటారన్నారు. ఆమె ప్రత్యేక విమానంలో సత్యసాయి విమానాశ్రయం చేరుకుంటారని, తిరిగి వెళ్లే వరకూ భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేయాలన్నారు. విమానాశ్రయం నుంచి నేరుగా సాయి శ్రీనివాస గెస్ట్ హౌస్‌కు చేరుకుని గౌరవవందనం స్వీకరిస్తారన్నారు. అనంతరం సాయికుల్వంత్ మందిరంలో జరిగే వేడుకల్లో పాల్గొని తిరిగి ఢిల్లీ వెళ్తారన్నారు. రాష్ట్రపతి పర్యటనకు పుట్టపర్తిలో సుమారు 2 వేల మందితో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. అవసరమైన చోట బారికేడ్లు ఏర్పాటు చేయాలన్నారు. సత్యసాయి జయంతి వేడుకలకు దేశవిదేశాల నుంచి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. భక్తులకు తాగునీటి వసతి, వైద్యం, పారిశుధ్య కార్యక్రమాలు, విద్యుత్ అంతరాయం కలగకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. అధికారులు సమన్వయంతో విధులు నిర్వర్తించాలన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ చేతన్, పెనుకొండ సబ్ కలెక్టర్ కార్తీక్, ఈఆర్‌ఓ కొండయ్య, ఆర్డీఓ భాగ్యరేఖ, ట్రస్ట్ ప్రతినిధి చలం, డీఎస్‌ఓ వంశీకృష్ణారెడ్డి, డీఆర్‌డీఏ పీడీ నరసయ్య, రవాణా శాఖాధికారి కరుణసాగర్‌రెడ్డి, డీఎంహెచ్‌ఓ ఎస్వీ కృష్ణారెడ్డి, డీసీహెచ్‌ఎస్ తిప్పేంద్రనాయక్, డీఎస్పీలు విజయ్‌కుమార్, వాసుదేవన్ తదితరులు పాల్గొన్నారు.
హౌసింగ్ పీడీగా నరసయ్య
పుట్టపర్తి అర్బన్: గృహనిర్మాణ శాఖ జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్(ఎఫ్‌ఏసీ)గా డీఆర్‌డీఏ పీడీ నరసయ్య బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకూ హౌసింగ్ పీడీగా ఉన్న చంద్రమౌళిరెడ్డి పదవీ కాలం ముగియడంతో నరసయ్యకు హౌసింగ్ పీడీగా పూర్తి అదనపు బాధ్యతలు ఇస్తూ ఉత్తర్వులిచ్చారు. దీంతో శుక్రవారం సాయంత్రం ఆయన కలెక్టరేట్‌లోని హౌసింగ్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పలువురు ఉద్యోగులు ఆయనకు అభినందనలు తెలిపారు.
అదనంగా ఒక టీఎంసీ విడుదలకు విజ్ఞప్తి
అనంతపురం సెంట్రల్: తుంగభద్ర జలాశయం నుంచి హెచ్చెల్సీకి మరొక టీఎంసీ నీరు విడుదల చేయాలని ఎస్‌ఈ రాజశేఖర్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు తుంగభద్ర బోర్డుకు, జలవనరుల శాఖ ఈఎన్‌సీ నారాయణరెడ్డికి వేర్వేరుగా లేఖలు రాశారు. బోర్డు అధికారులతో చర్చించారు. ఇందుకు బోర్డు అధికారులు సానుకూలంగా స్పదించారు. దీంతో మరో రెండు రోజుల్లో హెచ్చెల్సీకి నీరు నిలుపుదల కానుండగా.. ఈ నిర్ణయంతో మరో ఐదారు రోజులు పాటు అదనపు టీఎంసీ నీరు రానున్నాయని ఎస్‌ఈ రాజశేఖర్ తెలిపారు. హెచ్‌ఎల్‌ఎంసీ కింద సాగులో ఉన్న పంటలకు తడులు అందిస్తామని చెప్పారు. రైతులు కూడా నీటిని పొదుపుగా వాడుకోవాలని ఆయన సూచించారు.

మాట్లాడుతున్న కలెక్టర్ అరుణ్‌బాబు, ఎస్పీ మాధవరెడ్డి