● మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి
వెంకటాచలం: కేసుల పేరుతో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలను భయపెట్టాలని చూస్తే కూటమి నాయకులు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవల్సి వస్తుందని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి హెచ్చరించారు. మండలంలోని చెముడుగుంట పంచాయతీ నక్కలకాలనీలో మంగళవారం జెడ్పీటీసీ అభ్యర్థి డక్కిలి వెంకటరమణమ్మ, ఎంపీటీసీ అభ్యర్థి గంగాల మంజులకు మద్దతుగా కాకాణి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పలు నివాసాలకు వెళ్లి కరపత్రాలు అందజేసి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ జగనన్న పాలనలో ఎంత మేర అభివృద్ధి జరిగిందో, ప్రస్తుత చంద్రబాబు పాలనలో అభివృద్ధి ఎలా ఉందో ఆలోచన చేసి ప్రజలు ఓట్లు వేయాలని పిలుపునిచ్చారు. 2019 ఎన్నికల ముందు ప్రజలకిచ్చిన వాగ్దానాల్లో 99 శాతం అమలు చేసిన ఘనత రాష్ట్ర చరిత్రలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికే దక్కుతుందని పేర్కొన్నారు. జగనన్న పాలనలో ప్రతి ఆరు నెలలకు ఒకసారి కొత్త పెన్షన్లు మంజూరు చేసి లబ్ధిదారులకు అందజేశామని గుర్తుచేశారు. తాము మంజూరు చేసిన పెన్షన్లనే చంద్రబాబు అమలు చేస్తున్నారే తప్ప, కొత్తగా ఒక్కరికై నా పింఛన్ మంజూరు చేశారా అని ప్రశ్నించారు. అమ్మఒడి, వైఎస్సార్ చేయూత, కాపు నేస్తం, నేతన్న నేస్తం, మత్స్యకార భరోసా, వైఎస్సార్ ఆసరా, వాహన మిత్ర, వంటి పథకాల ద్వారా ప్రజలకు నేరుగా ఆర్థిక సాయం అందించిన ఘనత జగన్‌మోహన్‌రెడ్డిదేనని కొనియాడారు. కానీ కూటమి అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లలో చెప్పిన వాగ్దానాల్లో ఒక్కటైనా అమలు చేశారా అనేది ప్రజలు ఆలోచన చేయాలన్నారు. చెముడుగుంట పంచాయతీ నక్కలకాలనీలో పేదల కోసం లేఅవుట్ వేసి పట్టాలు పంపిణీ చేశామని, అయితే కోర్టు కేసుల కారణంగా ఆ ప్రక్రియ నిలిచిపోయిందన్నారు. అధికారం లేకపోయినా కోర్టు కేసుల పరిష్కారం కోసం వ్యక్తిగతంగా పోరాడి పేదలకు న్యాయం జరిగేలా చేస్తామని తెలియజేశారు. కొందరు నాయకులు పేదల భూములను ఆక్రమించుకుని వారినే బెదిరిస్తున్నారని, అలాంటి వారికి ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని కోరారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆక్రమణలకు గురైన భూములను విడిపించి పేదలకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
బెదిరిస్తే భయపడే ప్రసక్తే లేదు
అధికారం ఉందని బెదిరింపలకు పాల్పడితే భయపడే ప్రసక్తే లేదని, వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలకు అండగా ఉంటానని కాకాణి భరోసా ఇచ్చారు. అధికారం ఉందని విర్రవీగితే, భవిష్యత్ గురించి కూడా ఆలోచన చేయాలన్నారు. గతంలో తప్పు చేశామని వచ్చి క్షమాపణ కోరిన వారిని కూడా క్షమించామని, కానీ ఇప్పుడు మళ్లీ కేసులు, బెదిరింపు రాజకీయాలకు తెరలేపడం మంచి పద్ధతికాదన్నారు. ఎన్నికల ప్రచారంలో వైఎస్సార్‌సీపీ నాయకులు అందిస్తున్న కరపత్రాలు చించేసి, కావాలనే గొడవలు సృష్టించి పోలీస్‌స్టేషన్లలో కేసులు పెట్టడం ద్వారా భయపెట్టలేరన్నారు. పోలీసులు కేసులు నమోదు చేసి అరెస్ట్‌లు చేసినా భయపడే ప్రసక్తి లేదన్నారు. సోమిరెడ్డి ప్రచార కార్యక్రమాలకు ప్రజలు రాకపోవడంతో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై నిందలు వేయడం సరికాదన్నారు. నాయకుడిపై నమ్మకం, విశ్వాసం ఉంటే ప్రజలే వస్తారు తప్ప, బెదిరింపులతో జనాలను తీసుకురాలేరనే విషయం సోమిరెడ్డి తెలుసుకోవాలన్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో పాటు తనపై నమ్మకంతో సర్వేపల్లిలో ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని పేర్కొన్నారు. నియోజకవర్గంలోని ఐదు జెడ్పీటీసీ స్థానాలు, 79 ఎంపీటీసీ స్థానాల్లోనూ వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు నిలబడి విజయం కోసం కష్టపడి పనిచేస్తున్నారన్నారు. సోమిరెడ్డి ఎన్ని కుట్రలు చేసినా సర్వేపల్లిలో తాము తిరుగులేని విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.


