వింజమూరు(ఉదయగిరి): వింజమూరు పట్టణ ప్రజల దాహం తీర్చేందుకు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నిర్మించి, అందులో సోమశిల జలాలు నింపాలని స్థానికులు పదేళ్ల నుంచి పోరాటం చేస్తున్నారు. 2018లో అప్పటి ఎమ్మెల్యే బొల్లినేని రామారావు సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు నిర్మాణం కోసం బంగ్లా సెంటర్‌లో పాతూరు చెరువుపై శిలాఫలకం కూడా వేశారు. కానీ పనులు ప్రారంభం కాలేదు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాన రాజకీయ పార్టీలు సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు నిర్మిస్తామని హామీ ఇచ్చాయి. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో కొంత పురోగతి కనిపించింది. సోమశిల జలాల నుంచి నీటి కేటాయింపులు జరిగినా.. పనులు చేపట్టేందుకు నిధులు మంజూరు కాలేదు. ఈ క్రమంలో ఏప్రిల్ 1వ తేదీన సీఎం చంద్రబాబు వింజమూరు పర్యటన సందర్భంగా ఆరు నెలల్లో సోమశిల జలాలు వింజమూరు పాతూరు చెరువులో పోస్తామని హామీ ఇచ్చారు. కానీ ఆ హామీ కూడా అమలు కాలేదు.
స్థానికుల్లో తీవ్ర అసంతృప్తి
సమ్మర్ స్టోరేజీ నిర్మాణం కోసం రూ.34 కోట్ల నిధులు అవసరమని ఇరిగేషన్ అధికారులు అంచనా వేశారు. కానీ ఇంతవరకు పాలనాపరమైన అనుమతులు రాలేదు. విజయవాడలో రాష్ట్ర ఫైనాన్స్ సెక్షన్‌లో నెలల తరబడి ఆమోదం కోసం ఫైల్ నిరీక్షిస్తోంది. స్థానిక ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పదేపదే ప్రజలకు హామీ ఇచ్చినా ఇంతవరకు అమలు చేయలేదు. దీంతో పట్టణ ప్రజల్లో తీవ్ర అసంతృప్తి కనిపిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా చంద్రబాబు ఇచ్చిన హామీపై ప్రజల్లో చర్చ కనిపిస్తోంది.
ఆరునెలల్లో సమ్మర్ స్టోరేజ్
ట్యాంక్‌కు నీరిస్తామన్న
చంద్రబాబు
అయితే ఇప్పటికీ మంజూరు కాని నిధులు
మరోసారి మాట తప్పిన
చంద్రబాబు
ఆరు నెలల్లో వింజమూరు పాతూరు చెరువును సమ్మర్ స్టోరేజీ ట్యాంకుగా అభివృద్ధి చేసి సోమశిల నుంచి నీరు తెచ్చి నిల్వ చేస్తామని సీఎం చంద్రబాబు ఏప్రిల్ 1వ తేదీన వింజమూరులో జరిగిన పల్లెబాట కార్యక్రమంలో ప్రకటించారు. గడువు ముగిసినా ఇంతవరకు ఎలాంటి ముందడుగు పడలేదు. నీరిచ్చేది దేవుడెరుగు.. కనీసం ఇంతవరకు నిధులు కూడా మంజూరు కాలేదు. ఇటీవల ఇదే నియోజకవర్గంలో మరోసారి పర్యటించినా అప్పుడు కూడా దీనిపై ఎలాంటి ముందడుగు పడలేదు. ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో బాబు ఇచ్చిన హామీ ఏమైందంటూ వింజమూరు ప్రజలు నిలదీస్తున్నారు.
చెప్పడమే తప్ప చేయరు
వింజమూరులో సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు నిర్మాణం చేస్తామని రెండు సార్లు చంద్రబాబు హామీ ఇచ్చినా ఇంతవరకు నెరవేరలేదు. ఇచ్చిన మాటకు కట్టుబడే జగనన్నకు మద్దతుగా నిలిచి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటర్లు మంచి నిర్ణయం తీసుకోవాలి.
– గణపం బాలకృష్ణారెడ్డి,
మాజీ జెడ్పీటీసీ సభ్యుడు


