● మళ్లీ పెరిగిన నిమ్మధరలు ● దిగుబడి తగ్గడంతోనే..
పొదలకూరు: నిమ్మకాయల ధరలు నాలుగు రోజుల క్రితం తగ్గుముఖం పట్టాయి. మళ్లీ మోస్తరుగా పెరిగినట్టు వ్యాపారులు వెల్లడించారు. ప్రస్తుతం టాప్ ధరలు రూ.5 వేలు పలుకుతున్నాయి. నాలుగురోజుల క్రితం బస్తాకాయలు రూ.3 వేలే పలికాయి. తోటల్లో కాయల దిగుబడి సక్రమంగా లేకున్నా ధరలు పతనం కావడంపై రైతులు ఆందోళన చెందారు. ఈ క్రమంలో తిరిగి పుంజుకోవడంతో కొంత ఉపశమనం పొందుతున్నారు. వర్షాల కారణంగా తోటల్లో కాయలు కోసి మార్కెట్‌కు పంపకపోవడం వల్ల కూడా రెండురోజులుగా ధరలు పెరిగినట్టుగా తెలుస్తోంది. అయితే ధరలు మళ్లీ తగ్గే అవకాశం ఉందంటున్నారు. ఉత్తర భారతదేశంలో వర్షాలు, చలిపెరగడం వల్ల కాయలకు డిమాండ్ తగ్గినట్టుగా తెలుస్తోంది. అయితే పొదలకూరు నిమ్మమార్కెట్ యార్డుకు వస్తున్న కాయలను చాలావరకు దక్షిణ భారతదేశంలోని చైన్నె, కేరళ ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. కిలోల వంతున ప్రస్తుతం ధరలు రూ.40 నుంచి రూ.70 వరకు పలుకుతున్నాయి.
రెండు మాసాలు గడ్డుకాలమే
నిమ్మకాయలకు మరో రెండు మాసాలు గడ్డుకాలమేనని వ్యాపారులతో పాటు రైతులు కూడా అంటున్నారు. నవంబరు, డిసెంబరు నెలలను నిమ్మకు అన్‌సీజన్‌గా చెప్పుకుంటారు. వర్షాలతో పాటు చలితీవ్రత పెరుగుతున్నందున నిమ్మకాయల వాడకం గణనీయంగా తగ్గుతుంది. ఫలితంగా కాయలను అడిగే వారు కూడా ఉండరు. గతేడాది ఇదే సీజన్లో కిలో రూ.15 మాత్రమే ధరలు పలకడంతో జిల్లా అధికారులు యార్డుకు వచ్చి ఆరాతీయాల్సి వచ్చింది. చలితీవ్రత పెరిగితే గతేడాది పరిస్థితే ఏర్పడే అవకాశం ఉందంటున్నారు. జిల్లా వ్యాప్తంగా పొదలకూరు పరిసర ప్రాంతాల నుంచే అధికంగా నిమ్మకాయలు దిగుబడి అవుతాయి. అక్టోబరుకు ముందు అంటే జూన్, జూలై మాసాల్లో తోటలు పూతపూసి ఉంటే రైతులు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంటుంది. నవంబరు, డిసెంబరు మాసాల్లో పూతచెట్లు కాయల దిగుబడి అయి పతనావస్థలో ధరలు ఉన్న సీజన్లో రైతులు కాయలను అమ్మకోవాల్సి వస్తుంది.


