నెల్లూరు(క్రైమ్): జిల్లాలో ఈనెల 5న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో వింజమూరు, ఆత్మకూరు మండలాల్లో 4, 5 తేదీల్లో నిర్వహించాల్సిన అగ్రిగోల్డ్ బాండ్ల వెరిఫికేషన్ ప్రక్రియను సీఐడీ అధికారులు వాయిదా వేశారు. ఈ ప్రక్రియను ఈనెల 17, 18 తేదీల్లో నిర్వహించనున్నట్లు సోమవారం తెలిపారు. ఆయా మండలాల అగ్రిగోల్డ్ బాధితులు ఈ మార్పును గమనించాలని సూచించారు. ఈనెల 6 నుంచి మిగిలిన మండలాల్లో బాండ్ల వెరిఫికేషన్ యథావిధిగా కొనసాగుతుందని వెల్లడించారు.
5న వేతనంతో కూడిన సెలవు
నెహ్రూనగర్(గుంటూరు): ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో ఈనెల 5న వేతనంతో కూడిన సెలవు ప్రకటించినట్లుగా సంయుక్త కార్మిక కమిషనర్ సీహెచ్ ఆశారాణి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. గుంటూరు జోన్ పరిధిలోని గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు జిల్లాల్లో దుకాణాలు, వ్యాపార సంస్థలు, ప్రైవేట్ రంగ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు, కార్మికులకు ఈ సెలవు వర్తిస్తుందని పేర్కొన్నారు. ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఈ వెసులుబాటు కల్పించినట్లు తెలియజేశారు. ఎన్నికలు జరిగే ప్రాంతాల్లోని యాజమాన్యాలు ఈ ఆదేశాలను తప్పనిసరిగా అమలు చేయాలని సూచించారు.
ఉవ్వెత్తున ఎగసిపడుతున్న అలలు
● తీరానికి చేరిన మత్స్యకారుల బోట్లు
● వేటకు వెళ్లొద్దని అధికారుల హెచ్చరిక
చిల్లకూరు: మురసు తుఫాన్ ప్రభావంతో మండలంలోని మిద్దెరేవు, తీగపాళెం, శ్రీనివాససత్రం తీర ప్రాంతాల్లో సముద్రం అల్లకల్లోలంగా మారింది. సోమవారం అలలు ఉవ్వెత్తున ఎగసిపడ్డాయి. సముద్రంలో వేటకు వెళ్లొద్దని మత్స్యశాఖ, రెవెన్యూ, పోలీసు అధికారులు తీర ప్రాంత గ్రామాల్లో హెచ్చరికలు జారీ చేశారు. బోట్లు, వలలను భద్రపరుచుకోవాలని సూచించారు. ఇప్పటికే గుమ్మళ్లదిబ్బ, వరగలి, లింగవరం, మోమిడి గ్రామాలకు చెందిన మత్స్యకారులు తమ బోట్లను ఒడ్డుకు చేర్చి భద్రపరిచారు. మరోవైపు సముద్రం నుంచి వీస్తున్న ఈదురుగాలులు గ్రామాల వైపు బలంగా వీస్తుండటంతో ప్రజలు అప్రమత్తమయ్యారు. తుఫాన్ ప్రభావం నేపథ్యంలో తీర ప్రాంత ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, వాతావరణ పరిస్థితులను గమనిస్తూ అధికారుల సూచనలు పాటించాలని అధికారులు హెచ్చరించారు.
కండలేరులో 16.74 టీఎంసీలు
రాపూరు: కండలేరు జలాశయంలో సోమవారం నాటికి 16.74 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ఈఈ గజేంద్రరెడ్డి తెలిపారు. కండలేరు నుంచి సత్యసాయి గంగ కాలువకు 70, లోలెవల్ కాలువకు 10, పిన్నేరు కాలువకు 5, మొదటి బ్రాంచ్ కాలువకు 7 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు.


