నెల్లూరు(అర్బన్): జిల్లాలో మురసు తుపాను తన ప్రభావాన్ని చూపనుంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుపానుగా రూపాంతరం చెందింది. సోమవారం ఉదయం 25 కిలోమీటర్ల వేగంతో తీరంవైపుగా దూసుకురావడం మొదలుపెట్టింది. సాయంత్రానికి వేగం తగ్గి గంటకు 15 కిలోమీటర్ల వేగంతో నిధానంగా కదలడం ప్రారంభించింది. నెల్లూరుకు తూర్పు ఆగ్నేయంగా ఉన్న తుపాను కావలి, ఒంగోలు వైపు ప్రయాణిస్తూ రాత్రి 11 గంటలకు కావలికి 60 కిలోమీటర్లు, నెల్లూరుకు 70 కిలోమీటర్ల దూరానికి చేరుకుంది. మంగళవారం వేకువన నెల్లూరు– నర్సాపురం మధ్యన తుపాను తీరం దాటే అవకాశం ఉంది. ఆ సమయంలో గంటకు 100 కిలోమీటర్ల మేర వేగంతో గాలులు వీస్తాయని, భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. తుపాన్ ప్రభావంతో ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. గూడూరు, చిల్లకూరు, తదితర కొన్ని చోట్ల భారీ వర్షం నమోదైంది.ఈదురు గాలులకు చెట్ల కొమ్మలు విరిగిపడుతున్నాయి. నెల్లూరులోని మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో పెద్ద చెట్టు విరిగిపడడంతో గోడ కూలిపోయింది. స్థానికులకు త్రుటిలో ప్రమా దం తప్పింది. మరోవైపు సముద్రం అల్లకల్లోలంగా ఉంది. కెరటాలు ఉవ్వెత్తున ఎగసి పడుతున్నాయి. సముద్రం తొమ్మిది మీటర్ల మేర ముందుకు చొచ్చుకొచ్చింది. అధికారుల హెచ్చరికలతో మత్స్యకారులు అప్రమత్తమయ్యారు. చేపల వేటను నిలిపివేసి వేట సామగ్రిని సురక్షిత ప్రాంతానికి తరలించి భద్రపరుచుకున్నారు. మైపాడు, కొత్తకోడూరు, తదితర బీచ్‌ల వద్దకు సందర్శకులు రాకుండా, మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకుండా పోలీసులు గస్తీ కాస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా తీర ప్రాంత మండలాల్లో వర్షాలు కురిశాయి. ఆత్మకూరు, ఏఎస్‌పేట, ఉదయగిరి, మర్రిపాడు, తదితర మెట్టప్రాంత మండలాల్లో చినుకు జాడలేదు.
సముద్రంలో చిక్కుకున్న
మత్స్యకారులు సురక్షితం
జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ నుంచి వేటకు బయలుదేరిన మత్స్యకారుల బోటు ఆ ప్రాంతంలోని సముద్రంలో మరమ్మతులకు గురైంది. అందులో ఏడుగురు మత్స్యకారులు బోటులో చిక్కుకున్నారు. బోటు అలల ధాటికి కొట్టుకుపోతుండటంతో అప్రమత్తమైన స్థానిక మత్స్యకారులు మైరెన్ పోలీసులు, జిల్లా అధికారులతో కలిసి సముద్రంలో చిక్కుకున్న వారిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. మత్స్యకారులను కాపాడిన వారిని కలెక్టర్ హిమాన్షు శుక్లా అభినందించారు. తుపాను ప్రభావం తగ్గే వరకు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని కలెక్టర్ సూచించారు.
విక్రమసింహపురి రైలు రద్దు
తుపాను కారణంగా సోమవారం పలు రైళ్లను రద్దు చేస్తూ రైల్వేశాఖ నిర్ణయం తీసుకుంది. అందులో విజయవాడ నుంచి గూడూరుకు నడుస్తున్న 67225 నంబర్, గూడూరు నుంచి విజయవాడకు నడుస్తున్న 67226 నంబర్ రైళ్లను రద్దు చేశారు.
ఎన్డీఆర్ఎఫ్ బృందం రాక
తుపాను ప్రభావంతో జిల్లాలో ప్రధానంగా కావలి, బోగోలు, అల్లూరు మండలాల్లో అతి భారీవర్షాలు కురి సే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో సహాయక చర్యలు చేపట్టేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందం కావలికి చేరుకుంది. ఎ లాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా వరదలో చిక్కుకున్న వారిని ఎన్డీఆర్ఎఫ్ బృందం కాపాడనుంది.
పునరావాస కేంద్రాలు సిద్ధం
కలెక్టర్ ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులు పునరావాస కేంద్రాలను సిద్ధం చేశారు. అవసరాన్ని బట్టి ప్రజలను తరలించనున్నారు. ముత్తుకూరు మండలం పైనాపురం గ్రామంలోని కట్టకింద గిరిజన కాలనీకి చెందిన 30 మందిని కృష్ణపట్నం పోలీసులు పునరావాసాకేంద్రానికి తరలించారు. వారికి భోజనం, వసతులు రెవెన్యూ అధికారులు కల్పించారు.
వాకాడు: పొలాల్లో వర్షపు నీరు
సోమవారం రాత్రి కావలికి
60 కి.మీ. దూరంలో కేంద్రీకృతం
మంగళవారం వేకువన
తీరం దాటనున్న తుపాను
ఇప్పటికే జోరుగా వర్షాలు..
ఈదురుగాలులు
నేడూ భారీ వర్షాలు కురిసే అవకాశం
అల్లకల్లోలంగా సముద్రం
పలు రైళ్ల రద్దు
కృష్ణపట్నం పోర్టులో 8వ నంబర్ ప్రమాద హెచ్చరిక
ముత్తుకూరు : మురసు తుపాను హెచ్చరికల నేపథ్యంలో కృష్ణపట్నం పోర్టులో 8వ నంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. సోమవారం ఉదయం 8 గంటల వరకు మూడో నంబర్ హెచ్చరిక కొనసాగింది. అనంతరం పోర్టు సమీపానికి తుపాను రావడంతో అత్యంత ప్రమాదాన్ని సూచించే 8వ నంబర్ హెచ్చరికను జారీ చేశారు. పోర్టులోని కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేశారు. పోర్టు అధికారులు అప్రమత్తమై ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు. కాగా తుపాను ప్రభావంతో కృష్ణపట్నం తీరంలో సముద్రం ముందుకు చొచ్చుకొచ్చింది. అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని, తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండి జాగ్రత్తలు పాటించాలని మండలాధికారులు సూచించారు.
నెల్లూరు (అర్బన్): మురసు తుపాను హెచ్చరికల నేపథ్యంలో జిల్లాలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశమున్న దృష్ట్యా మంగళవారం కూడా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఎయిడెడ్, అంగన్వాడీ పాఠశాలలు, జూనియర్ కళా శాలలకు సెలవు ప్రకటిస్తున్నట్టు కలెక్టర్ హిమాన్షుశుక్లా సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.ఈ ఉత్తర్వులను అన్ని రకాల పాఠశాలలు, జూనియర్ కళాశాలల యాజమాన్యాలు తప్పనిసరిగా అమలు చేయాలని సూచించారు.


