విద్యుత్‌ పునరుద్ధరణకు ప్రత్యేక బృందాలు | - | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ పునరుద్ధరణకు ప్రత్యేక బృందాలు

Nov 2 2026 11:51 PM | Updated on Nov 2 2026 11:51 PM

● 2 వేల మంది సిబ్బంది సిద్ధం

● ఏపీఎస్పీడీసీఎల్‌ డైరెక్టర్‌ (ప్రాజెక్ట్‌) అయూబ్‌ఖాన్‌

నెల్లూరు(వీఆర్సీసెంటర్‌): మురసు తుఫాన్‌ నేపథ్యంలో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలిగితే వెంటనే పునరుద్ధరణ చర్యలు చేపట్టేందుకు 2 వేల మంది సిబ్బందిని సిద్ధంగా ఉంచినట్లుగా ఏపీఎస్పీడీసీఎల్‌ డైరెక్టర్‌ (ప్రాజెక్టు) అయూబ్‌ఖాన్‌ తెలిపారు. సీఎండీ శివశంకర్‌ ఆదేశాల మేరకు సోమవారం ఆయన నెల్లూరుకు వచ్చారు. ముందస్తు ఏర్పాట్లపై జిల్లా అధికారులతో విద్యుత్‌ భవన్‌లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తుఫాన్‌ అనంతరం యుద్ధప్రాతిపదికన విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరించేందుకు జిల్లా సిబ్బందితోపాటు చిత్తూరు, అనంతపురం, శ్రీసత్యసాయి, కర్నూలు జిల్లాల నుంచి మరో బృందాన్ని సిద్ధం చేసినట్లు తెలిపారు. మొత్తం 2 వేల మంది సిబ్బందిలో తమిళనాడు నుంచి వచ్చిన 500 మంది కూడా ఉన్నారని వివరించారు. ముందస్తుగా 7 వేల విద్యుత్‌ స్తంభాలు, 125 డ్రిల్లింగ్‌ యంత్రాలతోపాటు జేసీబీలు, ట్రాన్స్‌ఫార్మర్లు, కండక్టర్లను అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు. జిల్లాలోని కావలి, అల్లూరు, ఊటుకూరు, ముత్తుకూరు, రామతీర్థం, కోట తదితర తీర ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. విద్యుత్‌కు అంతరాయం ఏర్పడితే తాగునీటి సరఫరా, ఆస్పత్రులు, వీధి దీపాలు, గృహాలకు ప్రాధాన్యతనిస్తూ పునరుద్ధరణ పనులు చేపడతామన్నారు. సెల్‌ టవర్లకు నిరంతర విద్యుత్‌ అందించి సమాచార వ్యవస్థకు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రతి డివిజన్‌లో ప్రత్యేక కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేసి అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేసేలా ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. అనంతరం కావలిలోని ట్రాన్స్‌ఫార్మర్‌ మరమ్మతు కేంద్రాలను ఆయన సందర్శించారు. కార్యక్రమంలో ఏపీఎస్పీడీసీఎల్‌ చీఫ్‌ జనరల్‌ మేనేజర్లు రమణాదేవి, సంపత్‌కుమార్‌, ఎస్‌ఈ సుధాకర్‌, ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్లు విజయ్‌కుమార్‌రెడ్డి, గోపి, రమేష్‌, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్లు, అసిస్టెంట్‌ ఇంజినీర్లు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement