● కార్యకర్తల జోలికొస్తే సహించేది లేదు
● వైఎస్సార్‌సీపీ వెంకటగిరి
సమన్వయకర్త రామ్‌కుమార్‌రెడ్డి
వాకాడు: ఎన్నికల్లో ప్రజాస్వామ్య పద్ధతిలో కూటమిని ఎదుర్కొంటామని వైఎస్సార్‌సీపీ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి అన్నారు. వాకాడు మండలాన్ని నాశనం చేస్తామంటే చూస్తూ ఊరుకునేది లేదని, అలాగే వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తల జోలికొస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. మండలంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం తన నివాసంలో స్థానిక, నాయకులు, కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో అధికారపక్షంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను అడ్డుకునేందుకు బెదిరింపులకు దిగడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని మండిపడ్డారు. రాజకీయంగా ఎదుర్కోలేక ఒత్తిళ్లు, బెదిరింపులు, అభ్యర్థులను పోటీ నుంచి తప్పించే ప్రయత్నాలు చేయడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని విమర్శించారు. ఎన్ని రకాల ఒత్తిళ్లు ఎదురైనా వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. పార్టీ అభ్యర్థులకు అండగా ఉంటానని, కార్యకర్తల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే ప్రయత్నాలను తిప్పి కొడతామన్నారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. బెదిరింపులకు తలొగ్గకుండా పార్టీ శ్రేణులంతా ఐక్యంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.
ఎంపీడీఓ కార్యాలయాల్లో డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలు
నెల్లూరు(పొగతోట): జెడ్పీటీసీ, ఎంపీటీసీల పోలింగ్ ప్రక్రియ ఈనెల 5వ తేదీన జరుగుతుంది. దీనికి సంబంధించి జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. పోలింగ్ ప్రక్రియలో పాల్గొనే ఉద్యోగులకు శిక్షణ కార్యక్రమాలు పూర్తి చేశారు. మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయాల్లో డిస్ట్రిబ్యూషన్ సెంటర్లు ఏర్పాటు చేశారు. 4వ తేదీ ఉదయం ఉద్యోగులు అక్కడికి చేరుకుని ఎన్నికల సామగ్రిని తీసుకోవాల్సి ఉంటుంది. అనంతరం వారికి కేటాయించిన రూట్‌లో వాహనాల్లో కేంద్రాలకు చేరుకుంటారు. బ్యాలెట్ పేపర్లు, బ్యాలెట్ బాక్సులు, ఎన్నికల ఇతర వస్తువులను సబ్ ట్రెజరీలు, పోలీస్‌స్టేషన్లల్లో భద్రపరిచారు.
● జెడ్పీటీసీగా పోటీ చేసే అభ్యర్థులకు వైట్ బ్యాలెట్ పేపర్, ఎంపీటీసీలకు పింక్ బ్యాలెట్ పేపర్ కేటాయించారు. ఒక పోలింగ్ కేంద్రంలో 543 మంది ఓటర్లు ఉంటే లెక్క సక్రమంగా వచ్చేలా 550 పేపర్లు పోలింగ్ ఉద్యోగులకు ఇవ్వనున్నారు.


