ఎన్నికల నియమావళి చంద్రబాబు హైజాక్‌ | - | Sakshi
Sakshi News home page

ఎన్నికల నియమావళి చంద్రబాబు హైజాక్‌

Nov 2 2026 11:51 PM | Updated on Nov 2 2026 11:51 PM

పొదలకూరు : రాష్ట్రంలో ఎన్నికల నియమావళిని హైజాక్‌ చేసి, ఎన్నడూ లేని విధంగా మున్సిపల్‌ ఎన్నికలను దుర్మార్గంగా నిర్వహించిన ఘనతను చంద్రబాబు మూటగట్టుకున్నాడని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. పొదలకూరులోని పార్టీ కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల్లో మహిళలని కూడా చూడకుండా టీడీపీ గూండాలు ఇష్టారీతిన దాడులకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ఓటర్లు, ఏజెంట్లను దాడులతో భయపెట్టి రిగ్గింగ్‌ చేసుకున్నారని ఆరోపించారు. ఎన్నికలను సజావుగా నిర్వహిస్తే కూటమికి ఓటమి తప్పదనే భయంతోనే చంద్రబాబు ఇంతటికి బరితెగించారని విమర్శించారు. పులివెందులలోని ఆర్వో కార్యాలయం వద్ద ఏజెంట్లతో కలిసి మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బైఠాయించడాన్ని చూస్తే ఎన్నికలను ఎలా నిర్వహించారో అర్ధమవుతుందన్నారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను సైతం రాష్ట్రంలో సజావుగా నిర్వహిస్తారనే నమ్మకం లేదన్నారు.

అభివృద్ధిని చెప్పుకోలేక అవాకులు, చెవాకులు

సర్వేపల్లి నియోజకవర్గంలో 79 ఎంపీటీసీ, 5 జెడ్పీటీసీ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ పోటీ చేస్తోందని కాకాణి తెలిపారు. స్థానిక ఎన్నికల ప్రచారంలో సోమిరెడ్డి ఎక్కడా అభివృద్ధి గురించి చెప్పుకోలేక వైఎస్సార్‌సీపీ అభ్యర్థులపై అవాకులు, చెవాకులు మాట్లాడుతున్నారని విమర్శించారు. తమ హయాంలో చేసిన అభివృద్ధి తప్పించి సోమిరెడ్డి గ్రామాల్లో ఎక్కడా అభివృద్ధి పనులు చేసిన దాఖలాలు లేవన్నారు. అభ్యర్థులపై వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని, తాము వ్యక్తిత్వ హనానికి పాల్పడితే మీరు తట్టుకోలేరని హెచ్చరించారు. మా కుటుంబం గురించి మాట్లాడుతున్న సోమిరెడ్డి తన కుటుంబం చరిత్ర గురించి ముందుగా చెప్పాలని ధ్వజమెత్తారు. సర్వేపల్లి చరిత్రలో లేఅవుట్ల యజమానుల వద్ద డబ్బులు తీసుకున్న నాయకులు ఎవరూ లేరని, సోమిరెడ్డి ఒక్కడే అలాంటి పాడుపనులకు పాల్పడ్డారని ఆరోపించారు. టీడీపీకి అభ్యర్థులు దొరక్క పొదలకూరు లేఅవుట్లోని పార్కు స్థలాన్ని అమ్ముకున్న వాడిని పార్టీలో చేర్చుకుని ఎంపీటీసీగా పోటీలో పెట్టారని తెలిపారు. అవినీతికి పాల్పడలేదని సోమిరెడ్డిని పదేపదే ఆంజనేయస్వామి వద్ద ప్రమాణం చేయమని సవాల్‌ విసిరితే పారిపోతున్నారన్నారు.

వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను గెలిపించండి

మండలంలో అభివృద్ధి, సంక్షేమం చేసి చూపించిన ఘనత తమకే దక్కుతుందని కాకాణి అన్నారు. కనుకనే ధైర్యంగా ఓట్లు అడుగుతున్నామని తమ పార్టీ జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. స్థానిక ఎన్నికల్లో బెదిరింపులు, దౌర్జన్యాలు చేస్తే వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు సహించరని ధీటుగా బదులు ఇచ్చే సత్తా ఉందన్నారు. పోలీసులు ముఖ్యంగా పొదలకూరు ఎస్సై ఆటోల వారిని కూడా బెదిరిస్తున్నారని ఆయన లెక్కలను తేల్చుతామన్నారు. రక్షక భటులు చట్టాన్ని ఉల్లంఘించి ఇలా ప్రవర్తించడం ఎక్కడా చూడలేదన్నారు. జిల్లాలో శాంతి భద్రతల పరిస్థితిని ముందస్తుగా కలెక్టర్‌, ఎస్పీ దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. జెడ్పీటీసీ అభ్యర్థి బచ్చల సురేష్‌కుమార్‌రెడ్డి, పార్టీ మండలాధ్యక్షుడు పెదమల్లు రమణారెడ్డి, నాయకులు కోనం చినబ్రహ్మయ్య, తెనాలి నిర్మలమ్మ, ఆదూరు వెంకటసుబ్బయ్య, రావుల ఇంద్రసేన్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణ

టీడీపీ గూండాలతో ఏజెంట్లు, ఓటర్లను భయపెట్టి రిగ్గింగ్‌

దుర్మార్గంగా మహిళలని కూడా చూడకుండా దాడులు

మాజీ సీఎం జగన్‌ ఆర్వో వద్ద బై ఠాయించాల్సిన పరిస్థితి

నైతిక విలువలపై మాట్లాడే

అర్హత సోమిరెడ్డికి లేదు

మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement