నెల్లూరు(పొగతోట): జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి ఈ నెల 5న పోలింగ్, 7న ఓట్ల లెక్కింపు జరగనుంది. పోలింగ్‌కు 48 గంటల ముందు నుంచే మద్యం దుకాణాలు బంద్ చేయాలని కలెక్టర్ హిమాన్షుశుక్లా సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. మద్యం దుకాణాలు, బార్ల మూసివేతకు ఆయా శాఖల అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పోలింగ్ కేంద్రాల సమీపంలోని హోటళ్లు, ఇతర దుకాణాలను బంద్ చేయించాలని సూచించారు. ప్ర శాంత వాతావరణంలో ఎన్నికలు సజావుగా జరిగేలా చర్యలు చేపడుతున్నామన్నారు. ఎన్నికల నియమావళిని అందరూ పాటించాలని కోరారు.
నేటితో ‘స్థానిక’
ప్రచారానికి తెర
నెల్లూరు(పొగతోట): జెడ్పీటీసీ, ఎంపీటీసీల ఎన్నికల ప్రచారానికి మంగళవారం సాయంత్రం 5 గంటలతో తెరపడనుంది. ఎన్నికల నియమావళి ప్రకారం పోలింగ్ రోజుకు 48 గంటల ముందు ఎన్నికల ప్రచారాన్ని నిలిపివేయాల్సి ఉంది. ఈ నెల 5న ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఎన్నికల బరిలోని అభ్యర్థులు గత వారం రోజులుగా ముమ్మరంగా ఎన్నికల ప్రచారం సాగిస్తున్నారు. ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు ఎన్నికల ప్రచారానికి అనుమతి ఉంది. చివరి రోజు మంగళవారం సాయంత్రం 5గంటలలోపు అభ్యర్థులు తమ ప్రచార పర్వాన్ని ముగించాల్సి ఉంది. సాయంత్రం 5 గంటల తరువాత ప్రచారం నిర్వహిస్తే ఎన్నికల నియమాళి ప్రకారం అభ్యర్థులపై కేసులు నమోదు చేసే అధికారం అధికారులకు ఉంది.
ఓట్లేస్తేనే అభివృద్ధి చేస్తాం..
లేకపోతే వదిలేస్తాం
● మంత్రి ఆనం వ్యాఖ్యలు
సోమశిల: స్థానిక ఎన్నికల ప్రచార పర్వంలో భాగంగా అనంతసాగరం మండలంలో మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఓట్లేస్తేనే అభివృద్ధి చేస్తాం..లేకపోతే వదిలేస్తామంటూ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. అనంతసాగరం పరిధిలోని నేషనల్ ఫంక్షన్ హాల్లో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో అనం ‘గతంలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో అనంతసాగరం మండలంలో టీడీపీకి 650 ఓట్లు తగ్గాయి. ప్రస్తుతం జరిగే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో కనీసం ఆరువేల మెజార్టీ రావాలి. ఓట్లేస్తేనే మండలాన్ని గుర్తుపెట్టుకుని అభివృద్ధి చేస్తాం..లేకపోతే వదిలేస్తాం. మండలం అభివృద్ధిలో వెనుకబడిపోతుంది’ అంటూ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై మండల ప్రజలు మండిపడుతున్నారు. మంత్రి హోదాలో ఉండి ఓట్ల కోసం ఇలా బెదిరింపులకు దిగడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.
పోస్టల్ బ్యాలెట్
ఓటింగ్‌లో ప్రలోభాలు
వింజమూరు(ఉదయగిరి): వింజమూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సోమవారం స్థానిక ఎన్నికల పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్‌లో ఓ చిరుద్యోగి పలువురు ఉద్యోగులను ప్రలోభపెడుతూ అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తూ హల్‌చల్ చేశారు. పోలింగ్ కేంద్రం ఆవరణలో గంటలు తరబడి మకాం వేసి సహోద్యోగులను ప్రభావితం చేశారనే ఆరోపణలు వినిపించాయి. పోలీసులు లేకపోవడంతోనే ఈ పరిస్థితి నెలకొందనే విమర్శలు వ్యక్తమయ్యాయి. మంగళవారం అయినా పోలీసులను నియమించి నిబంధనల మేరకు ఓటింగ్ జరిగేలా ఆర్వో చర్యలు తీసుకోవాలని ఉద్యోగులు కోరుతున్నారు.


