నెల్లూరు(క్రైమ్): పురపోరులో ప్రజలు స్వేచ్ఛగా, నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా పటిష్ట భద్రతా చర్యలు తీసుకున్నామని ఎస్పీ అజిత వేజెండ్ల చెప్పారు. ఆదివారం నెల్లూరు పొదలకూరు రోడ్డు జిల్లా ప్రజా పరిషత్ బాలుర, బాలికల ఉన్నత పాఠశాలల్లోని 17 సెన్సిటివ్, నగరంలోని పలు సమస్యాత్మక, సున్నితమైన పోలింగ్ కేంద్రాలను ఎస్పీ సందర్శించారు. పోలింగ్ సరళి, భద్రతా ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం పోలీసు కవాతు మైదానంలోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్‌రూమ్ నుంచి నెల్లూరు కార్పొరేషన్, బుచ్చిరెడ్డిపాళెం, ఆత్మకూరు ప్రాంతాల్లో పోలింగ్ సరళిని సమీక్షించారు. అదేవిధంగా ఏఎస్పీ సీహెచ్ సౌజన్య మాగుంట లేఅవుట్‌లోని విశ్వసాయి స్కూల్లో పోలింగ్ కేంద్రాలను సందర్శించి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు.


