పొదలకూరు: ఏడాదిన్నర క్రితం నమోదైన అక్రమ మైనింగ్ కేసులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పొదలకూరు బిట్ – 2 ఎంపీటీసీ అభ్యర్థి వాకాటి సంధ్య భర్త, పొదలకూరు మాజీ ఉప సర్పంచ్ వాకాటి శ్రీనివాసులురెడ్డికు 41 నోటీస్‌ను పోలీసులు అందజేశారు. మండలంలోని రుస్తుం మైన్‌లో మైనింగ్‌ను అక్రమంగా నిర్వహించి రూ.కోట్లు దోచుకున్నారంటూ 14 మందిపై కేసును పొదలకూరు పోలీసులు గతేడాది ఫిబ్రవరిలో నమోదు చేశారు. మాజీ మంత్రి, పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డిని ఏ – 4 గా చేర్చి అరెస్ట్ చేసి జైలుకు పంపిన విషయం తెలిసిందే. ఇదే కేసులో ఏ – 2, 3గా వాకాటి శివారెడ్డి, వాకాటి శ్రీనివాసులురెడ్డి పేర్లను చేర్చారు. ఇప్పటికే 60 రోజుల పాటు రిమాండ్ ఖైదీగా జిల్లా కారాగారంలో శివారెడ్డి ఉండి బెయిల్‌పై వచ్చారు. అప్పటి నుంచి బెయిల్ కోసం వాకాటి శ్రీనివాసులురెడ్డి యత్నిస్తున్నారు. అయితే ఎస్సీ, ఎస్టీ కేసు ఇంప్లీడ్ కావడంతో ముందస్తు బెయిల్ మంజూరులో జాప్యం జరిగింది. దీంతో పోలీసులు అరెస్ట్ చేయకపోవడంతో స్థానిక ఎన్నికల్లో తన సతీమణి సంధ్యను వాకాటి శ్రీనివాసులురెడ్డిపై బరిలో నిలిపి ప్రచారంలో పాల్గొంటున్నారు. దీంతో అధికార పార్టీ నేతలు అదను చూసి వాకాటిని అరెస్ట్ చేయించేందుకు ఎత్తుగడ వేశారనే చర్చ నడుస్తోంది. కాగా విచారణకు హాజరైన ఆయన్ను తిరిగి ఈ నెల ఆరో తేదీన రావాలని డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు సూచించారు.


