నెల్లూరు రూరల్: పురపాలక ఎన్నికల తరుణంలో ప్రచారంపై నిషేధం శుక్రవారం సాయంత్రం ఐదు నుంచి అమల్లోకి రానుందని కలెక్టర్ హిమాన్షు శుక్లా గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. గడువు ముగిసిన వెంటనే సంబంధిత పరిధిలో ఓటర్లు కాని రాజకీయ నేతలు, కార్యకర్తలు, మద్దతుదారులు, ఇతర వ్యక్తులు అక్కడ్నుంచి వెళ్లిపోవాలని సూచించారు. కల్యాణ మండపాలు, కమ్యూనిటీ హాళ్లు, లాడ్జీలు, అతిథిగృహాల్లో బస చేస్తున్న వారి వివరాలను పోలీసులు పరిశీలించాలని సూచించారు. కీలక ప్రాంతాల్లో చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి వాహనాల రాకపోకలను పర్యవేక్షించాలని, వ్యక్తుల గుర్తింపు పత్రాలను తనిఖీ చేయాలని ఆదేశించారు. ఎన్నికలను స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు రాజకీయ పార్టీలు, అభ్యర్థులు, ప్రజలు సహకరించాలని కోరారు.


