● పలువురికి గాయాలు
ఉదయగిరి రూరల్: మదనపల్లి జిల్లా గుర్రంకొండ సమీపంలోని ముదివేటి టోల్‌ప్లాజా వద్ద గురువారం వేకువజామున రోడ్డు ప్రమాదం జరిగింది. పామూరు – బెంగళూరు బస్సును ఎదురుగా వచ్చిన కారు ఢీకొనడంతో పలువురు గాయపడ్డారు. వివరాలిలా ఉన్నాయి. ఉదయగిరి డిపోకు చెందిన బస్సు పామూరు నుంచి బెంగళూరుకు వెళ్తోంది. ఈక్రమంలో ముదివేటి టోల్‌ప్లాజా వద్దకు చేరుకోగానే కడప వైపు వెళ్తున్న కారు బస్సును ఎదురుగా ఢీకొంది. ఈ ఘటనలో కారు పూర్తిగా దెబ్బతినగా, అందులో ప్రయాణిస్తున్న పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదంపై ఆర్టీసీ సిబ్బంది డిపో మేనేజర్‌కు సమాచారం అందించారు. ప్రయాణికులను బెంగళూరుకు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ప్రమాదానికి గురైన బస్సును డిపోకు తరలించారు.
మోటార్‌బైక్‌పై వెళ్తుండగా..
● లారీ ఢీకొని వ్యక్తి మృతి
సంగం: మండలంలోని జాతీయ రహదారిపై సంగం కొండ కూడలి వద్ద గురువారం లారీ ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో పెరమన గ్రామానికి చెందిన కాకర్ల చెన్నకేశవరెడ్డి (55) అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసుల కథనం మేరకు.. చెన్నకేశవరెడ్డి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆయన తీవ్రంగా గాయపడి చనిపోయాడు. సమాచారం అందుకున్న సంగం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేశారు.
36 గ్రాముల బంగారం,
కిలో వెండి చోరీ
నెల్లూరు(క్రైమ్): ఇంట్లో ఎవరూ లేని సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడిన ఘటన అంబాపురంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. అంబాపురం గ్రామానికి చెందిన సుమతి బుధవారం రాత్రి తన తండ్రి రమణయ్యతో కలిసి స్థానిక రామాలయంలో కోలాటం చూసేందుకు వెళ్లారు. తిరిగి ఇంటికి వచ్చేసరికి ప్రధాన ద్వారం గడ్డపారతో పగులగొట్టి ఉండటాన్ని గుర్తించారు. లోపలికి వెళ్లి చూడగా బీరువా తెరిచి ఉంది. అందులో భద్రపరిచిన 36 గ్రాముల బంగారు ఆభరణాలు, కిలో వెండి వస్తువులు కనిపించలేదు. దీంతో బాధితురాలు గురువారం వేదాయపాళెం పోలీసులకు ఫిర్యాదు చేయగా ఘటనా స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేశారు.
రాష్ట్ర స్థాయి ఖోఖో
పోటీలకు ఎంపిక
నెల్లూరు(టౌన్): రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీలకు నెల్లూరులోని కేఎన్నార్ స్కూల్‌కు చెందిన ఐదుగురు విద్యార్థులు ఎంపికయ్యారని ప్రధానోపాధ్యాయురాలు శారద తెలిపారు. గురువారం స్కూల్లో విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో జరిగిన జిల్లా స్థాయి పోటీల్లో ప్రతిభ చూపడంతో రాష్ట్ర స్థాయి అండర్ – 14 పోటీలకు అలకనంద, నిఖిత, కీర్తన, అండర్ – 17కు మాధురి, నాగదర్శిని ఎంపికయ్యారన్నారు. కార్యక్రమంలో పీడీ సుస్మిత పాల్గొన్నారు.
సాగర తీరం.. ప్రశాంతం
● మత్స్యకారులకు ఊరట
వాకాడు: బంగాళాఖాతంలో ఏర్పడిన అర్నబ్ తుఫాన్ తీరం దాటడంతో గురువారం సముద్రంలో అలజడి తగ్గి ప్రశాంత వాతావరణం నెలకొంది. నాలుగురోజులుగా మండల పరిధిలోని తూపిలిపాళెం వద్ద అల్లకల్లోలంగా కనిపించిన సముద్రం ఒక్కసారిగా శాంతించడంతో తీర ప్రాంత ప్రజలు, మత్స్యకారులు ఊపిరి పీల్చుకున్నారు. తుఫాన్ ఎటువైపు తీరం దాటుతుందోనన్న ఆందోళనతో భయాందోళనకు గురయ్యారు. తూపిలిపాళెం వద్ద సముద్రంలో గత కొద్దిరోజులుగా అలల ఉధృతి పెరగడంతో మత్స్యకారులు సైతం అప్రమత్తమయ్యారు. ఈ క్రమంలో ఉత్తరాంధ్ర తీరంలో తీరం దాటిన అనంతరం వాతావరణంలో అనుకూల మార్పులు చోటు చేసుకున్నాయి. సముద్రంలో అలజడి తగ్గి ప్రశాంతత నెలకొనడంతో ఊరట లభించింది.


