రహస్యంగా ఉపాధి సోషల్‌ ఆడిట్‌ | - | Sakshi
Sakshi News home page

రహస్యంగా ఉపాధి సోషల్‌ ఆడిట్‌

Oct 30 2026 2:27 AM | Updated on Oct 30 2026 2:27 AM

ఉదయగిరి: ఉదయగిరి మండలంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులపై సోషల్‌ ఆడిట్‌ రహస్యంగా సాగుతోందనే విమర్శలున్నాయి. గతంలో ఆడిట్‌ బృందాలు గ్రామస్థాయిలో తనిఖీలు ప్రారంభించే ముందు పత్రికలు, మీడియాకు సమాచారం అందించేవి. దీంతో మండలంలోని అన్ని గ్రామాల ప్రజలకు ఆడిట్‌ ప్రక్రియపై అవగాహన ఉండేది. ఆయా గ్రామాల్లో పనుల నిర్వహణలో జరిగిన అవకతవకలను ఆడిట్‌ బృందాల దృష్టికి తీసుకెళ్లేందుకు అవకాశం కలిగేది. అయితే ఈసారి అందుకు భిన్నంగా బృందాలు గుట్టుచప్పుడు కాకుండా రికార్డులను పరిశీలిస్తూ తనిఖీలు నిర్వహిస్తున్నాయని పలు గ్రామాల ప్రజలు అంటున్నారు.

రూ.9.66 కోట్ల ఖర్చు

మండలంలో 2025 ఏప్రిల్‌ నుంచి 2026 జూన్‌ వరకు 862 పనులకు సంబంధించి వేతనాలు, సామగ్రి రూపంలో రూ.9.66 కోట్లు ఖర్చు చేశారు. ఈనెల 21వ తేదీ నుంచి 17 పంచాయతీల్లో సోషల్‌ ఆడిట్‌ బృందాలు తనిఖీలు చేపట్టాయి. ఈ పనులన్నీ కూటమి ప్రభుత్వ హయాంలోనే జరిగిన నేపథ్యంలో, వాటిలోని అవకతవకలు వెలుగులోకి రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలిసింది. ఇప్పటికే అప్పసముద్రం, కృష్ణంపల్లి, గండిపాళెం, నేలటూరు, జి.చెరువుపల్లి, గన్నెపల్లి, జి.చెర్లపల్లి గ్రామాల్లో సభలు పూర్తయ్యాయి. ఈ ప్రక్రియ నవంబర్‌ 13వ తేదీ వరకు కొనసాగనుంది. అయితే పనుల పరిశీలన, కూలీల విచారణ, మస్తర్ల తనిఖీ వంటి అంశాలపై కొంతమంది కూలీలకు కూడా సమాచారం తెలియడం లేదు.

ప్రచారం లేకుండానే..

సోషల్‌ ఆడిట్‌లో భాగంగా సభలు నిర్వహించే ముందు గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేయాలి. కానీ అలాంటి చేయకుండా కొందరు నుంచి సంతకాలు తీసుకుని సభలను తూతూమంత్రంగా ముగిస్తున్నారు. అధికార పార్టీ నేతల ఒత్తిళ్లు ఉండటంతో ఆడిట్‌ అధికారులు, క్షేత్ర సహాయకులు, మేట్లు అవగాహనకు వచ్చి ముడుపులు తీసుకుని తనిఖీలు చేశామా.. గ్రామసభలు ముగించామా అనే రీతిలో వ్యవహరిస్తున్నారు. దీంతో పనుల్లో జరిగిన అవకతవకలు వెలుగులోకి రాకుండా కప్పిపుచ్చుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పారదర్శకంగా ఆడిట్‌ నిర్వహించి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాల్సిన బృందాలు రహస్యంగా తనిఖీలు నిర్వహించడంపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో అక్రమాలు బయటకు రాకుండా అధికార పార్టీ నేతలు చక్రం తిప్పుతున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇప్పటికై నా సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి సోషల్‌ ఆడిట్‌ పారదర్శకంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు

నామమాత్రంగా పనుల తనిఖీలు

తూతూమంత్రంగా గ్రామసభలు

అవకతవకలు వెలుగులోకి రాకుండా కప్పిపుచ్చుతున్నారనే విమర్శలు

స్థానిక సంస్థల ఎన్నికల వేళ అధికార పార్టీ నేతల ఒత్తిళ్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement