నెల్లూరు(పొగతోట): కూటమి నేతల ప్రలోభాలు, కుట్రలు, కుతంత్రాలు మరోసారి బటబయలయ్యాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజాక్షేత్రంలో విజయం సాధించలేక అడ్డదారులు తొక్కారు. ఒక్కో జెడ్పీటీసీ అభ్యర్థికి రూ.కోట్ల మేర అందజేసి విత్ డ్రా చేసేలా కుట్ర పన్నారు. వీరికి కొందరు ఆర్వోలు సహాయ.. సహకారాలను అందించారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీల నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియను మంగళవారం నిర్వహించారు. సీతారామపురం, బుచ్చిరెడ్డిపాళెం, చిల్లకూరు, కొడవలూరు, ఇందుకూరుపేట జెడ్పీటీసీలు ఏకగ్రీవమయ్యాయి. చిల్లకూరు మండలంలో అభ్యర్థిని ప్రలోభాలకు గురిచేసి, బెదిరించడంతో కుటుంబంతో సహా గ్రామం వదిలి వెళ్లిపోయారు. బుచ్చిరెడ్డిపాళెం, ఇందుకూరుపేట, కొడవలూరు మండలాల్లో రూ.కోట్లల్లో చేతులు మారాయని సమాచారం. మరోవైపు నామినేషన్లను మధ్యాహ్నం మూడులోపు ఉపసంహరించుకోవాల్సి ఉన్నా, అనేక మండలాల్లో ఈ తంతును సాయంత్రం నాలుగు వరకు కొందరు ఆర్వోలు నిర్వహించారు. బీ ఫారాలను అభ్యర్థులే తీసుకురావాలనే నిబంధనను మర్రిపాడు, తదితర మండలాల్లో ఆర్వోలు విధించారు.


