ఐటీడీఏ.. వివాదాలమయం | - | Sakshi
Sakshi News home page

ఐటీడీఏ.. వివాదాలమయం

Oct 28 2026 1:24 AM | Updated on Oct 28 2026 1:24 AM

నెల్లూరు(వేదాయపాళెం): సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ యానాదులు) పరిధిలో గిరిజన సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాల అమలుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌ కె.శ్రీనివాసరావు ఏకపక్ష నిర్ణయాలు, వ్యవహారశైలితో గిరిజనుల సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదని సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. ఐదు జిల్లాల పరిధిలోని గిరిజనులకు అందాల్సిన సంక్షేమ ఫలాలు సక్రమంగా అందడం లేదు. నెల్లూరు కొండాయపాళెం గేటు సమీపంలోని ఐటీడీఏ కార్యాలయం కేంద్రంగా తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, నెల్లూరు, కడప జిల్లాల్లో గిరిజనాభివృద్ధికి అవసరమైన చర్యలు చేపట్టాల్సి ఉంది. అయితే ఆయా జిల్లాల్లో మంత్రులు, వీఐపీల పర్యటనలు ఉన్నప్పుడే అధికారులు స్పందిస్తున్నారని, మిగిలిన సందర్భాల్లో గిరిజనుల సమస్యలను పట్టించుకోవడం లేదని ఆరోపణలున్నాయి.

అందుబాటులో లేకుండా..

ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌ నెలలో నాలుగైదు రోజులు కూడా ప్రధాన కార్యాలయంలో ప్రజలకు, సిబ్బందికి అందుబాటులో ఉండటం లేదనే ఆరోపణలున్నాయి. ఇతర జిల్లాల్లో పర్యటనలు, క్యాంపుల పేరుతో అలవెన్సులు, బిల్లులు సమర్పిస్తూ ప్రభుత్వ నిధులను విచ్చలవిడిగా వినియోగిస్తున్నారని గిరిజన సంఘాల నేతలు అంటున్నారు. శ్రీనివాసరావు బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి గిరిజనులకు అందాల్సిన పలు పథకాల అమలులో నిర్లక్ష్యం చోటుచేసుకుంటోందని చెబుతున్నారు. గిరిజన మత్స్యకారులకు కనీస సదుపాయాల కల్పనలోనూ తగిన శ్రద్ధ చూపడం లేదని విమర్శిస్తున్నాయి.

చేపల వేట లైసెన్సుల జారీలో జాప్యం

సోమశిల జలాశయంలో చేపల వేట ద్వారా జీవనోపాధి పొందుతున్న గిరిజన మత్స్యకారులు లైసెన్సుల జారీలో జాప్యంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సమాచారం. ఐటీడీఏ తరఫున అందాల్సిన లైసెన్సులు సకాలంలో జారీ కాకపోవడంతో, లీజుల పేరుతో వేలాది రూపాయల సెస్సు చెల్లించాల్సి వస్తోందని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇంట్లో పని మనుషులుగా..

ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌ ఇంట్లో వంట, శుభ్రత తదితర వ్యక్తిగత పనులకు గిరిజన మహిళలను వినియోగించుకుంటున్నారని సంఘాల నాయకు లు ఆరోపిస్తున్నారు. ఐటీడీఏ పరిధిలోని వివిధ కార్యాలయాల్లో కాంట్రాక్ట్‌ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ కొందరు గిరిజన నాయకుల ద్వారా మహిళలను సమీకరించి, వ్యక్తిగత అవసరాలకు వినియోగించుకుంటున్నారని కార్యాలయ సిబ్బంది చెబుతున్నారు. అలాగే ఆయన అప్పుడప్పుడు మాత్రమే కార్యాలయానికి వస్తున్నారని, సమావేశాల సమయంలో సిబ్బందితో ముఖ్యంగా మహిళా ఉద్యోగులతో అనుచితంగా మాట్లాడుతున్నారని అభియోగాలున్నాయి. చిన్నపాటి పొరపాట్లను సున్నితంగా తెలియజేయాల్సిన ఉన్నతాధికారి తన వ్యక్తిగత సమస్యలను, కోపాన్ని తమపై ప్రదర్శిస్తే చూస్తు ఊరుకోబోమని పలువురు మహిళా ఉద్యోగినులు బాహాటంగానే బదులిచ్చిన ఘటన ఇటీవల చోటుచేసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం.

కలెక్టర్‌కు సన్నిహితుడనే ప్రచారం

కలెక్టర్‌కు అత్యంత సన్నిహితులైన అధికారుల్లో ఐటీడీఏ ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌ కూడా ఒకరనే ప్రచారం జరుగుతోంది. అందువల్లే ఏకపక్ష నిర్ణయాలు, పరిపాలనా లోపాలపై ఆరోపణలు ఉన్నప్పటికీ చర్యలు కనిపించడం లేదని పలువురు విమర్శిస్తున్నారు. ఐదు జిల్లాల పరిధిలో గిరిజనుల సంక్షేమం, అభివృద్ధికి కీలకమైన ఐటీడీఏలో పరిపాలనపై వస్తున్న ఆరోపణలను ఉన్నతాధికారులు పరిశీలించాలని గిరిజన సంఘాలు, బాధిత వర్గాలు కోరుతున్నాయి.

గురుకులం విషయంలో..

నెల్లూరు నగరంలోని పొదలకూరు రోడ్డులో ఉన్న గిరిజన బాలికల గురుకుల పాఠశాల వ్యవహారం వివాదాస్పదంగా మారింది. కలెక్టర్‌ సూచనల మేరకు గత నెల 5వ తేదీన ప్రిన్సిపల్‌ అయిన మహిళను ట్రైబల్‌ వెల్ఫేర్‌ కార్యదర్శికి సరెండర్‌ చేశారు. అయితే ఈనెల 9న ఆమె తిరిగి విధుల్లో చేరడం, ఇందుకు సంబంధించిన శాఖాపరమైన ఉత్తర్వులపై స్పష్టత లేకపోవడం చర్చకు దారితీసింది. ఇన్‌చార్జి ప్రిన్సిపల్‌ నుంచి స్టోర్‌రూమ్‌, కార్యాలయ తాళాలను బలవంతంగా తీసుకున్నారనే ఆరోపణలూ వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటన జరిగి 20 రోజులు గడుస్తున్నా సంబంధిత ఉన్నతాధికారులు చర్యలు తీసుకోలేదని కొందరు సిబ్బంది పేర్కొంటున్నారు.

అక్కడంతా ఏకపక్ష నిర్ణయాలే..

గిరిజన సంక్షేమంపై నిర్లక్ష్యం

బాలికల గురుకులం వ్యవహారంలోనూ వివాదం

నిరంకుశ ధోరణిలో ప్రాజెక్ట్‌ అఫీసర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement