నెల్లూరు(బారకాసు): ఒకటి కాదు.. రెండు కాదు.. ఎన్నో సంవత్సరాలు ఆ ప్రాంత ప్రజలు ఎదురుచూస్తున్న కల సాకారమైంది. అధ్వానంగా మారిన రోడ్డుపై ప్రయాణించలేక ఇబ్బందులు పడుతున్న స్థానికులు.. రహదారిని బాగు చేయాలని కనిపించిన నాయకులందరినీ వేడుకున్న సందర్భాలున్నాయి. చివరకు 2019లో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటి నెల్లూరు సిటీ ఎమ్మెల్యే, మంత్రి డాక్టర్ పోలుబోయిన అనిల్‌కుమార్ యాదవ్ చొరవతో మైపాడు రోడ్డు అభివృద్ధి పనులు చేపట్టారు. నగరంలోని పాత చెక్‌పోస్టు నుంచి వేణుగోపాల్‌నగర్ సమీపంలోని చేపల మార్కెట్ వరకు నాలుగులేన్ల సిమెంట్ రోడ్డు వేసి టీడీపీ నాయకుల కళ్లు తెరిపించారు. నిర్మాణం పూర్తవడంతో ఆ ప్రాంత రూపురేఖలు మారాయి.
ఎన్నో ఏళ్లుగా ఇబ్బందులు
నెల్లూరు నగరం నుంచి ఇందుకూరుపేట మండలంలోని పలు గ్రామాలకు వెళ్లేందుకు మైపాడు రోడ్డు ప్రధాన మార్గంగా ఉంది. దీనికి ఇరువైపులా నగరపాలక సంస్థ పరిధిలోని ప్రస్తుత 7, 8, 9 డివిజన్లు (పాత 3, 4, 5 డివిజన్లు) విస్తరించి ఉన్నాయి. దశాబ్దాలుగా రహదారి అభివృద్ధిపై తగిన శ్రద్ధ చూపకపోవడంతో అది అధ్వానంగా మారింది. భారీ వాహనాల రాకపోకలు అధికంగా ఉండే ఈ రహదారిపై గుంతలు, ఇరువైపులా ఆక్రమణల కారణంగా రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడేది. నిత్యం ట్రాఫిక్ రద్దీతో వాహనదారులు సకాలంలో గమ్యస్థానాలకు చేరుకోలేకపోయేవారు. ఇరుకై న రహదారిపై భారీ వాహనాల రాకపోకలతో ప్రమాదాల భయం కూడా ఉండేది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వల్ల ఇప్పుడు పరిస్థితి మారిపోయింది.
రూ.13 కోట్లతో..
మైపాడు రోడ్డు అభివృద్ధికి అప్పటి అనిల్‌కుమార్ యాదవ్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. రహదారి నిర్మాణానికి అవసరమైన నిధుల మంజూరు కోసం అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి పలుమార్లు తీసుకెళ్లారు. ప్రభుత్వం స్పందించి నిధులు మంజూరు చేయడంతో పనులు ప్రారంభమయ్యాయి. నగరంలోని పాత చెక్‌పోస్టు నుంచి వేణుగోపాల్ నగర్, చేపల మార్కెట్ సమీపం వరకు సుమారు 2.7 కిలోమీటర్ల మేర రూ.13 కోట్లతో నాలుగు లేన్ల సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టి పూర్తి చేశారు. దీంతో భారీ వాహనాలు, కార్లు, ద్విచక్ర వాహనాల రాకపోకలు సులభతరమయ్యాయి. రహదారిని మరింత సుందరంగా తీర్చిదిద్దేందుకు మరో రూ.7 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టారు. ఇందులో భాగంగా రోడ్డుకు ఇరువైపులా డ్రెయిన్లు నిర్మించారు. మధ్యలో డివైడర్ ఏర్పాటు చేసి పచ్చదనం పెంచేందుకు పూలమొక్కలు నాటారు. సెంట్రల్ లైటింగ్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేశారు.
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో మైపాడు రోడ్డు విస్తరణ
2.7 కి.మీ. మేర నాలుగులేన్ల సీసీ రోడ్డు
రూ.7 కోట్లతో సుందరీకరణ పనులు
కనిపించలేదా?
కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో టీడీపీ నేతలు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. వైఎస్సార్‌సీపీ హయాంలో జరిగిన కళ్ల ముందు కనిపిస్తున్నా ఏమీ చేయలేదంటూ ఊకదంపుడు ఉపన్యాసాలు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలైనా ఇటువంటివి చెప్పుకోదగ్గ అభివృద్ధి పనులు ఎక్కడా చేపట్టలేదు. ఇంకా కార్పొరేషన్ పరిధిలో పలు పనుల పేరిట తెలుగు తమ్ముళ్లకు దోచిపెట్టేందుకు ఉపయోగం లేని పనులు చేపడుతున్నారు.


