కార్పొరేషన్‌ ఎన్నికల్లో టీడీపీకి గుణపాఠం చెప్పండి | - | Sakshi
Sakshi News home page

కార్పొరేషన్‌ ఎన్నికల్లో టీడీపీకి గుణపాఠం చెప్పండి

Oct 28 2026 1:24 AM | Updated on Oct 28 2026 1:24 AM

● ఆర్యవైశ్యుల అభివృద్ధి

వైఎస్‌ జగన్‌తోనే సాధ్యం

● మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌

నెల్లూరు(బృందావనం): నెల్లూరు కార్పొరేషన్‌ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకు ప్రజలు మద్దతు తెలిపి టీడీపీకి తగిన గుణపాఠం చెప్పాలని మాజీ మంత్రి, ఆర్యవైశ్య నేత వెల్లంపల్లి శ్రీనివాస్‌ తెలిపారు. నెల్లూరు నగరంలోని 59వ డివిజన్‌లో మంగళవారం ఆయన వైఎస్సార్‌సీపీ మేయర్‌ అభ్యర్థి ఆనం విజయకుమార్‌రెడ్డి, 59వ డివిజన్‌ కార్పొరేటర్‌ అభ్యర్థి చీదెళ్ల కిషన్‌కు మద్దతుగా మాజీ మంత్రి, పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి, ఎమ్మెల్సీ, సిటీ ఇన్‌చార్జి పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డితో కలిసి విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌ మాట్లాడారు. రాష్ట్రంలో ఆర్యవైశ్యులకు అండగా నిలిచింది నాడు దివంగత మహానేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి, ఆ తరువాత అండగా నిలిచింది ఆయన కుమారుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అనే విషయాన్ని గుర్తించాలన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో ఆర్యవైశ్యులకు పదవులెన్నో వచ్చాయన్నారు. అందుకు కృతజ్ఞతగా చీదెళ్ల కిషన్‌కు మద్దతు ప్రకటించాలన్నారు. నెల్లూరు ప్రజలు వైఎస్సార్‌సీపీకి ఓటు వేసి నెల్లూరు మేయర్‌ సీటును వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి కానుకగా ఇవ్వాలని కోరారు.

చంద్రబాబును తరిమికొట్టడం ఖాయం

ఎన్నికల హామీలను విస్మరించి కల్లబొల్లి కబుర్లతో రెండున్నర సంవత్సరాల పరిపాలన సాగించిన చంద్రబాబును ప్రజలు తరమికొట్టేందుకు సిద్ధమయ్యారని కాకాణి గోవర్ధన్‌రెడ్డి తెలిపారు. ఆయన మాట్లాడుతూ టీడీపీ నేతల సంక్షేమం గురించి చెప్పుకోలేని స్థితిలో ఉన్నారు. ఓటమి భయం పట్టుకున్న చంద్రబాబు పోలీసులు, గూండాలు, గంజాయి బ్యాచ్‌లతో ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారని విమర్శించారు. నాయకులను పోలీస్‌స్టేషన్‌లకు పిలిపించి వారిని విత్‌డ్రాలు చేయించాలని చూడటం దారుణమన్నారు. నెల్లూరు నగరాభివృద్ధిని గాలికొదిలేశారని కాకాణి దుయ్యబట్టారు. రాష్ట్ర మున్సిపల్‌ శాఖ మంత్రి పొంగూరు నారాయణ అవినీతి, అక్రమాలకు పాల్పడుతూ ప్రజల సొమ్మును పార్టీ నాయకులకు దోచిపెడుతున్నారన్నారు. వీటికి అడ్డుకట్ట వేయాలంటే కార్పొరేషన్‌ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ విజయం సాధించాలన్నారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా జరిగేలా కలెక్టర్‌, ఎస్పీ చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో నాయకులు మాళెం సుధీర్‌కుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement