నెల్లూరు(టౌన్): ఇందుకూరుపేట మండలం పల్లిపాడు డైట్‌లో ఈనెల 28వ తేదీన జిల్లా స్థాయి రోల్‌ప్లే, ఫోక్ డ్యాన్స్ పోటీలు నిర్వహించనున్నట్లు డీఈఓ ఆర్.బాలాజీరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకత, నైపుణ్యాలను వెలికి తీసేందుకు ఏటా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పాఠశాల విద్యాశాఖ, ఎస్సీఈఆర్టీ, సమగ్రశిక్ష, జిల్లా విద్యాశాఖ, ప్రభుత్వ డైట్ కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో ఈ పోటీలను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలోని అన్ని యాజమాన్యాల పరిధిలోని పాఠశాలల్లో 8, 9 తరగతులు చదువుతున్న విద్యార్థులు, ఎన్‌పీఈపీ పోర్టల్లో రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకుని తమ ఎస్కార్ట్ ఉపాధ్యాయులతో కలిసి పోటీల్లో పాల్గొనాలని సూచించారు. ప్రథమ స్థానంలో నిలిచిన వారు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికవుతారని వెల్లడించారు. ఆ పోటీలు నవంబర్‌లో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. వివరాలకు నోడల్ అధికారి ఫోన్ 90100 85001 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.
రైల్లోంచి జారిపడి
వృద్ధుడి మృతి
నెల్లూరు(క్రైమ్): రైల్లోంచి జారిపడి గుర్తుతెలియని వృద్ధుడు మృతిచెందిన ఘటన నెల్లూరు రైల్వేస్టేషన్ – విజయమహల్ గేట్ సమీపంలో చైన్నె వైపు వెళ్లే పట్టాలపై మంగళవారం చోటుచేసుకుంది. మృతుడి వయసు 50 నుంచి 55 సంవత్సరాల్లోపు ఉంటుందని భావిస్తున్నారు. నలుపు రంగుపై బులుగు రంగు డాట్స్ గల షార్ట్ ధరించి ఉన్నాడు. సమాచారం అందుకున్న నెల్లూరు రైల్వే ఎస్సై హరిచందన ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని జీజీహెచ్ మార్చురీకి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
జిల్లాకు నేడు భారీ
వర్ష సూచన
నెల్లూరు(అర్బన్): ఆర్నబ్ తుఫాన్ తీరంవైపు దూసుకొస్తుండటంతో ఆ ప్రభావం జిల్లాపై పడనుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. జిల్లాకు ఎల్లో అలర్ట్‌ను ప్రకటించింది. భారీ వర్షాలు బుధవారం కురిసే అవకాశముందని తెలిపింది. సముద్రంలో అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతూ.. ఆరు నుంచి ఎనిమిది మీటర్ల వరకు ముందుకొచ్చింది. వేటకు మత్స్యకారులు వెళ్లొద్దనే అధికారుల హెచ్చరికలతో వారంతా తిరిగొచ్చేశారు. కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. ఏమైనా ఇబ్బందులొస్తే 0861 – 2331261, 79955 76699 నంబర్లను సంప్రదించొచ్చు.
స్థానిక ఎన్నికలకు
74 మంది మైక్రో అబ్జర్వర్లు
నెల్లూరురూరల్: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో భాగంగా మైక్రో అబ్జర్వర్ల కేటాయింపును ఎన్నికల పరిశీలకురాలు సదా భార్గవి ఆధ్వర్యంలో నెల్లూరులో మంగళవారం ర్యాండమైజేషన్ పద్ధతిలో చేపట్టారు. ఆత్మకూరు, బుచ్చిరెడ్డిపాళెం మున్సిపాలిటీలతోపాటు నెల్లూరు నగరపాలక సంస్థకు మొత్తం 74 మందిని కేటాయించారు. వీరిలో 62 మందిని విధులకు కేటాయించగా, మరో 12 మందిని రిజర్వ్‌లో ఉంచారు. ఆత్మకూరుకు 14 మంది, బుచ్చిరెడ్డిపాళేనికి ఐదుగురు, నెల్లూరు నగరపాలక సంస్థకు 55 మందిని కేటాయించారు. కార్యక్రమంలో సీపీఓ లక్ష్మీనరసింహం, ఏపీఐఐసీ జెడ్‌ఎం శివకుమార్, శోభారాణి తదితరులు పాల్గొన్నారు.


