● కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు
● అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ఆదేశాలు
నెల్లూరు(అర్బన్): బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుఫాన్‌గా మారడంతో జిల్లాకు భారీ వర్షాల హెచ్చరిక జారీ అయింది. మంగళ, బుధవారాల్లో కోస్తాంధ్ర జిల్లాలతోపాటు నెల్లూరు జిల్లాలోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. తీరం దాటే సమయంలో బలమైన గాలులు వీచే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ప్రభుత్వ ఆదేశాలతో కలెక్టర్ హిమాన్షు శుక్లా అప్రమత్తమయ్యారు. అధికారులతో ఫోన్‌లో మాట్లాడి, మూడురోజులపాటు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సిద్ధంగా ఉండాలని ఆర్డీఓలకు తెలిపారు. మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లకుండా చూడాలని రెవెన్యూ, మత్స్యశాఖ, పోలీసు అధికారులను ఆదేశించారు. బీచ్‌లలో పర్యాటకుల ప్రవేశాన్ని నిలిపివేయాలని, ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని సూచించారు. అత్యవసర సేవలకు ఆటంకం కలగకుండా సంబంధిత సిబ్బంది అందుబాటులో ఉండాలని ఆదేశించారు.
● భారీ వర్షాల వల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా సమాచారం అందించేందుకు కలెక్టరేట్‌లో 24 గంటలూ పనిచేసేలా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు 0861 – 2331261, 79955 76699, 1077 నంబర్లకు ఫోన్ చేయాలని అధికారులు సూచించారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులు, సమాచారాన్ని స్వీకరించి సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసేందుకు రెవెన్యూ సిబ్బందికి షిఫ్టుల వారీగా విధులు కేటాయించారు.
● తుఫాన్ ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది. అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. కొత్తకోడూరు, మైపాడు, రామతీర్థం, తూపిలిపాళెం తదితర తీర ప్రాంతాల్లో సముద్రం 6 నుంచి 8 మీటర్ల మేర ముందుకు చొచ్చుకొచ్చింది. దీంతో మత్స్యకారులు తమ వలలు, పడవలను ఒడ్డుకు చేర్చుకున్నారు. ఆకాశం మేఘావృతమై చల్లటి గాలులు వీస్తున్నాయి.
శైవక్షేత్రాలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
నెల్లూరు సిటీ: ఆర్టీసీ డిపో–1లో శబరిమల, శైవక్షేత్రాలకు ప్రత్యేక ప్యాకేజీలతో బస్సులను ఏర్పాటు చేసినట్లుగా ప్రజారవాణా అధికారి షేక్ షమీమ్ తెలిపారు. నెల్లూరులోని ఆర్టీసీ బస్టాండ్‌లో ప్రత్యేక టికెట్ కౌంటర్‌ను సోమవారం ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ అమరావతిలోని అమరారామం, భీమవరంలోని సోమారామం, పాలకొల్లులోని క్షీరారామం, ద్రాక్షారామంలోని భీమేశ్వరాలయం, సామర్లకోటలోని కుమారారామం క్షేత్రాలకు బస్సులు నడుస్తాయన్నారు. నెల్లూరు మినీ బస్టాండ్ నుంచి నవంబర్ 14, 15, 21, 22, 23, 28, 29 తేదీలతోపాటు డిసెంబర్ 5, 6 తేదీల్లో ఉదయం 9 గంటలకు ప్రత్యేక బస్సులు బయలుదేరుతాయన్నారు. రిజర్వేషన్ల కోసం 99592 25653, 0861–2323333 ఫోన్ నంబర్లను సంప్రదించాలని కోరారు. శబరిమలకు ప్రత్యేక బస్సులు పెట్టామన్నారు. వెళ్లే దారిలో కాణిపాకం, భవానీ, ఎరిమేలి, పంబ వద్ద నిలుపుతామన్నారు. తిరిగి వచ్చే సమయంలో కుర్తాళం, మధురై, చైన్నె, మేళమరువత్తూర్‌లలో ఆగుతుందన్నారు. బస్సును బుక్ చేసుకుంటే ఏడుగురికి ఉచిత ప్రయాణం కల్పిస్తామన్నారు. నవంబర్ 16, 19, 20, 22, 26, 27, 29, డిసెంబర్ 3, 4, 6, 11, 12, 14, 16, 19, 20, 24, 25, 26, 28, 30, జనవరి 2, 9 బస్సులు అందుబాటులో ఉంటాయని వివరాలకు 99592 25653, 73829 26439 ఫోన్ నంబర్లను సంప్రదించాలని కోరారు.


