● రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి ఫైర్
కావలి: బోగోలు మండలం కోళ్లదిన్నెలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై కావలి తుమ్మలపెంట బస్టాండ్‌లో రాత్రివేళ ఆ గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు మారణాయుధాలతో దాడి చేసిన ఘటనలో పోలీసుల తీరు అన్యాయంగా ఉందని కావలి వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం నామినేషన్ వేశారన్న నెపంతో ఇద్దరిపై దాడి చేసి, తలలు పగులగొట్టి చంపేందుకు ప్రయత్నిస్తే.. పోలీసులు దాడికి పాల్పడిన వారికి, బాధితులకు ఒకే సెక్షన్లు పెట్టి చేతులు దులుపుకొన్నారని మండిపడ్డారు. డీఎస్పీ వీవీ రమణకుమార్‌ను పట్టణంలో సోమవారం ప్రతాప్‌కుమార్‌రెడ్డి కలిసి దాడి జరిగిన తీరును వివరించారు. అధికార పార్టీకి చెందిన వారు సాగిస్తున్న రౌడీయిజాన్ని కూడా తెలియజేశారు. బాధితులకు న్యాయం చేయాలని కోరారు. అనంతరం రామిరెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం ప్రసన్న అనే పచ్చపార్టీ కార్యకర్త ఆగడాలు శ్రుతిమించాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. 75 ఏళ్ల వృద్ధుడని కూడా కనికరం లేకుండా తల పగులగొట్టి, ఒళ్లంతా కుళ్లపొడిచి పైశాచికత్వం ప్రదర్శిస్తున్నారన్నారు. గ్రామంలో రౌడీయిజమే పనిగా పెట్టుకుని ఆయన రెచ్చిపోతున్నారని పేర్కొన్నారు. అంతేకాకుండా మహిళలతో అనుచితంగా ప్రవర్తించడం, చివరకు ఇళ్ల ముంగిళ్లలో వేసుకున్న ముగ్గులను కూడా చెరిపేయడం వంటి చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. గతంలోనూ వైఎస్సార్‌సీపీ వారిపై అన్యాయంగా దాడులకు తెగబడ్డారన్నారు. బాధితులు ఏరియా వైద్యశాలలో చికిత్స పొందుతుండగా ఆస్పత్రిలోకి చొచ్చుకొచ్చి మరీ దాడికి పాల్పడ్డారని మండిపడ్డారు. దీని వెనుక ఎమ్మెల్యే ప్రోత్సాహం లేదా అని ప్రశ్నించారు. ఇలాంటివి ఎంతోకాలం సాగవని, ముందు ముందు వాటి పర్యవసానాలు చూస్తారని హెచ్చరించారు. ఇలాంటి దుశ్చర్యలపై పోలీసు ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకుని న్యాయం చేయాలని కోరారు. ఇలాంటివి పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకోకపోతే వైఎస్సార్‌సీపీ క్యాడర్ అంతా డీఎస్పీ కార్యాలయం ముందు కూర్చోక తప్పదని స్పష్టం చేశారు.


