● కావలి మాజీ ఎమ్మెల్యే
ప్రతాప్‌కుమార్‌రెడ్డి ధ్వజం
కావలి: ‘స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుస్తామని టీడీపీకి నమ్మకం లేదు. అందుకే నేతలు నామినేషన్ల ప్రక్రియలో దౌర్జన్యాలకు పాల్పడ్డారు. ఆ పార్టీ తీరు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం’ అని కావలి నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. ఆదివారం పట్టణంలోని తన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికలను ప్రజాస్వామ్య పద్ధతిలో ఎదుర్కోలేక టీడీపీ నేతలు దౌర్జన్యాలు, దాడులకు దిగడం సిగ్గుచేటన్నారు. రాయలసీమ, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో అభ్యర్థులను నామినేషన్లు వేయనీయకుండా రక్తపాతం సృష్టించండం హేయమైన చర్య అని విమర్శించారు. గెలుపుపై నమ్మకం ఉంటే ఎన్నికలు స్వేచ్ఛగా జరిగేలా చూడాలని, రౌడీలు, గూండాలను రంగంలోకి దించి కర్రలు, కత్తులు, రాడ్లతో అభ్యర్థులను అడ్డుకోవడం ఏమిటని ప్రశ్నించారు. మహిళా అభ్యర్థుల పట్ల కూడా కనీస గౌరవం చూపకుండా నామినేషన్ పత్రాలను లాక్కోవడం, అసభ్యంగా ప్రవర్తించడం వంటి ఘటనలు సమాజం తలదించుకునేలా ఉన్నాయన్నారు. స్థానిక ఎన్నికల విషయంలో కూటమి ప్రభుత్వ వైఖరిపై సీఎం చంద్రబాబు ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కొన్ని జిల్లాల్లో అధికారులు ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరిస్తుండటం అభినందనీయమని పేర్కొంటూ వారికి ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్‌లోనూ ఇదే విధంగా నిష్పక్షపాతంగా వ్యవహరించాలని కోరారు.
ఎమ్మెల్యేపై వ్యతిరేకత
కావలిలో కొందరు నాయకులు వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను ప్రలోభాలకు గురిచేస్తున్నారని, ఇలాంటి చర్యలను సహించబోమని రామిరెడ్డి అన్నారు. ఎమ్మెల్యే కావ్యా కృష్ణారెడ్డి పాలనపై ప్రజల్లో వ్యతిరేకత ఉందన్నారు. అక్రమ కేసులు, అన్యాయాలపై ప్రజలు అసంతృప్తితో ఉన్నారన్నారు. కావలి నియోజకవర్గంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలను గెలుచుకుని వైఎస్సార్‌సీపీ సత్తా చాటుతుందని ధీమా వ్యక్తం చేశారు.
● అనంతరం బోగోలు మండల మాజీ కన్వీనర్ మద్దిబోయిన వీరరఘు, కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి, కుందుర్తి శ్రీనివాసులు మాట్లాడుతూ గతంలో వైఎస్సార్‌సీపీలో పనిచేసి ప్రస్తుతం మరో పార్టీలో ఉన్న ఓ నాయకుడు ఓటర్లను, నామినేషన్లు దాఖలు చేస్తున్న అభ్యర్థులను భయపెడుతూ, ప్రలోభాలకు గురిచేస్తున్నారని ఆరోపించారు. తన రాజకీయ ప్రస్థానం, వ్యవహారశైలిని గుర్తుంచుకుని హద్దుల్లో ఉండాలని, పద్ధతి మార్చుకోకపోతే పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి, ఉదయగిరి నియోజకవర్గ నేత చేజర్ల సుబ్బారెడ్డి, పార్టీ పట్టణాధ్యక్షుడు కేతిరెడ్డి శివకుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


