● సీట్ల కేటాయింపులో అన్యాయం
● రోడ్డెక్కిన జనసైనికులు
● మంత్రి నారాయణపై ఆగ్రహం
● 6వ డివిజన్‌లో పోటీలో బీజేపీ, జనసేన అభ్యర్థులు
నెల్లూరు సిటీ: నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల్లో కూటమిలో పొత్తు కుంపటి రాజుకుంది. మంత్రి పొంగూరు నారాయణ జనసేనను చిన్నచూపు చూస్తున్నారని, కనీసం పట్టించుకోవడం లేదని జనసైనికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘అన్నా మాకు జరుగుతున్న అన్యాయాన్ని గుర్తించండి.. న్యాయం చేయండి’ అని పవన్ కళ్యాణ్‌ను వేడుకుంటున్నారు. లోలోపల రుగులుతున్న కోపాన్ని జనసైనికులు ఒక్కొక్కరుగా బయటకు వచ్చి సోషల్ మీడియా సాక్షిగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో నగరంలో జనసేన కేడర్ టీడీపీ నేతల వ్యవహారంపై తీవ్రంగా మండిపడుతోంది.
20 అడిగితే 7కు పరిమితం
కార్పొరేషన్ పరిధిలో నగరంలో 10, రూరల్లో 10 లెక్కన మొత్తం 20 సీట్లను జనసేన ఆశించింది. తీరా రాష్ట్ర స్థాయి నేత వచ్చినా చర్చలు జరిపి కేవలం సిటీలో 4, రూరల్‌లో 4 సీట్లు ఇస్తామని ఫైనల్ చేశారు. అయితే సిటీలో 3 సీట్లు ఇస్తున్నట్లు మంత్రి నారాయణ ప్రకటించారు. 6వ డివిజన్‌లో బత్తల శ్రీకాంత్ తాను పోటీలో ఉంటానని ప్రకటించారు. పార్టీ సైతం అతడికి బీ–ఫారం ఇచ్చింది. అయితే చివరి నిమిషంలో నారాయణ ఆ డివిజన్‌ను బీజేపీకి కేటాయించగా అభ్యర్థిగా సుకుమార్‌ను ప్రకటించారు. అయితే జనసేన నేత శ్రీకాంత్ పట్టించుకోకుండా పోటీ చేస్తున్నారు. దీంతో ఆ డివిజన్‌లో బీజేపీ, జనసేనలు తమ గుర్తులపై పోటీ చేస్తున్నాయి. రెండు రోజుల నుంచి ఇరు పార్టీల అభ్యర్థులు ప్రచారం చేస్తున్నారు.
అన్యాయం కనిపించడం లేదా?
పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నో ఏళ్లుగా ఉన్నానని, 60వ డివిజన్‌లో పోటీకి బీఫారం కూడా ఇచ్చారని, కానీ దళితుడినైన తనకు అన్యాయం జరుగుతోందంటూ టోనీబాబు అనే నేత సోషల్ మీడియాలో చెప్పుకొచ్చారు. తాను నామినేషన్ వేసిన తర్వాత విత్‌డ్రా చేసుకోవాలని పలువురు ఒత్తిడి చేస్తున్నట్లు చెబుతున్నారు. టీడీపీ నేతలు భిక్ష ఇచ్చినట్లు వ్యవహరిస్తున్నారన్నారు. 20 సీట్లు తీసుకోవాలని అనుకున్నామని, ఫ్రెండ్లీ పోటీకి వెళ్దామని శివశంకర్ చెప్పారన్నారు. దీంతో బీ–ఫారం కూడా రిటర్నింగ్ అధికారికి ఇవ్వడం జరిగిందన్నారు. అయితే ఇప్పుడు బీ–ఫారం సక్రమంగా లేదని నిరాకరించారని ఆవేదన వ్యక్తం చేశారు. జనసేనలో తాము ఉన్నామా? లేదా? అర్థం కావడం లేదన్నారు.


