ముగిసిన నామినేషన్ల ప్రక్రియ | - | Sakshi
Sakshi News home page

ముగిసిన నామినేషన్ల ప్రక్రియ

Oct 24 2026 12:04 AM | Updated on Oct 24 2026 12:04 AM

● 35 జెడ్పీటీసీలకు 302 నామినేషన్లు

● 440 ఎంపీటీసీ స్థానాలకు 2,639

● నేడు పరిశీలన

● 25, 26 తేదీల్లో అభ్యంతరాల స్వీకరణ

● 27న విత్‌డ్రా

నెల్లూరు(పొగతోట): స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి జెడ్పీటీసీ, ఎంపీటీసీల నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. శుక్రవారం చివరిరోజు రాత్రి 9:30 గంటల వరకు స్వీకరణ ప్రక్రియ కొనసాగింది. మూడురోజుల నుంచి నెల్లూరులోని జిల్లా పరిషత్‌ కార్యాలయంలో జెడ్పీటీసీ అభ్యర్థుల నుంచి అధికారులు నామినేషన్లు స్వీకరించారు.

జిల్లా వ్యాప్తంగా 35 జెడ్పీటీసీ స్థానాలున్నాయి. వాటికి 302 నామినేషన్లు వచ్చాయి. మొదటిరోజు 12, రెండోరోజు 115, మూడోరోజు 175 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. చివరిరోజు వేసిన వారిలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు 111 మంది, టీడీపీ నుంచి 115, బీఎస్పీ 19, బీజేపీ 8, సీపీఐ (ఎం) 2, కాంగ్రెస్‌ 11, జెఎస్పీ 17, స్వతంత్రులు 19 మంది ఉన్నారు.

ఇక 440 ఎంపీటీసీ స్థానాలకు 2,639 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల నుంచి 1,152, టీడీపీ నుంచి 1,124, బీఎస్పీ నుంచి 23, బీజేపీ నుంచి 59, సీపీఐ (ఎం) నుంచి 44, కాంగ్రెస్‌ నుంచి 23, జేఎస్పీ నుంచి 81, బీసీవైపీ నుంచి 2, స్వతంత్రులు 131 మంది ఉన్నారు. చివరిరోజు అత్యధికంగా 1,084 మంది అభ్యర్థులు నామినేషన్‌ పత్రాలు సమర్పించారు. జెడ్పీ సీఈఓ మధుసూదన్‌, డిప్యూటీ సీఈఓ బ్రహ్మయ్య ఈ ప్రక్రియను పర్యవేక్షించారు.

శనివారం నామినేషన్ల పరిశీలన ప్రక్రియ నిర్వహించనున్నారు. జెడ్పీటీసీలకు సంబంధించి జిల్లా పరిషత్‌ కార్యాలయంలో జరుగుతుంది. ఎంపీటీసీలకు సంబంధించిన పరిశీలన ఆయా మండలాల్లో ఎంపీడీఓ కార్యాలయాల్లో నిర్వహిస్తారు.

ఈనెల 25వ తేదీన నామినేషన్లపై అభ్యంతరాలు స్వీకరిస్తారు. జెడ్పీటీసీలకు సంబంధించినవి కలెక్టర్‌ హిమాన్షు శుక్లా సమర్పించాలి. ఎంపీటీసీలవి ఆయా రెవెన్యూ డివిజన్ల ఆర్డీఓలకు ఇవ్వాలి.

26వ తేదీన అభ్యంతరాలపై నిర్ణయం తీసుకుంటారు. 27వ తేదీన నామినేషన్ల ఉపసంహారణ ప్రక్రియ చేపట్టనున్నారు. వచ్చే నెల 3వ తేదీన పోలింగ్‌ నిర్వహించనున్నారు. 5వ తేదిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరుగుతుంది.

మండలాలకు ఎన్నికల సామగ్రి

జెడ్పీటీసీ, ఎంపీటీసీల ఎన్నికలకు సంబంధించిన సామగ్రి జెడ్పీ కార్యాలయం నుంచి మండలాలకు పంపించారు. బ్యాలెట్‌ బాక్సులు, పోలింగ్‌ సామగ్రి పంపిణీ జరిగింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement