గూడూరు: స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో గూడూరులో ప్రజాస్వామ్యం ఖూనీ అయింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు నామినేషన్ దాఖలు చేసేందుకొచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను లక్ష్యంగా చేసుకొని దౌర్జన్యకాండకు టీడీపీ శ్రేణులు తెగబడ్డాయి. దీన్ని అడ్డుకోవాల్సిన పోలీసులు.. ప్రేక్షక పాత్రకే పరిమితమయ్యారు. బారికేడ్లకు ముందు పచ్చ పార్టీ కార్యకర్తలు, అల్లరిమూకలు నిలిచి.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అడ్డుకొని దౌర్జన్యానికి పాల్పడ్డారు. నామినేషన్ వేసే హక్కు లేదానని ప్రశ్నించిన వీరిపై పచ్చమూకలు దాడికి పాల్పడ్డాయి. గూడూరులోని టవర్‌క్లాక్ సెంటర్లో జరిగిన ఈ ఘటనపై పలువురు మండిపడుతున్నారు.


