● ప్రచారానికి ముందస్తు
అనుమతి తప్పనిసరి
● ప్రలోభాలకు పాల్పడితే కఠిన చర్యలు
బ్యాలెట్ బాక్స్‌లు సిద్ధం చేస్తున్న సిబ్బంది
నెల్లూరు(క్రైమ్): జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల సందడి మొదలైంది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి రావడంతో అభ్యర్థులు, రాజకీయ పార్టీలు, ప్రజలు నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి. ఉల్లంఘనలకు పాల్పడితే సంబంధిత అధికారులు చట్టప్రకారం చర్యలు తీసుకుంటారు.
ప్రచారానికి అనుమతి తప్పనిసరి
ఎన్నికల ప్రచారంలో లౌడ్‌స్పీకర్లు, మైకులు వినియోగించాలంటే సంబంధిత అధికారుల నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలి. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు వీటి వినియోగంపై నిషేధం ఉంటుంది. అనుమతి లేకుండా ప్రచార కార్యక్రమాలు నిర్వహించరాదు.
అధికారిక వనరుల వినియోగం నిషేధం
ఎన్నికల ప్రచారానికి మంత్రులు, ప్రజాప్రతినిధులు ప్రభుత్వ వాహనాలు, భవనాలు, నిధులు, సిబ్బంది, ఇతర అధికారిక వనరులను ఉపయోగించరాదు. ప్రభుత్వ నిధులతో సంక్షేమ పథకాల ప్రచార ప్రకటనలు జారీ చేయకూడదు. లబ్ధిదారులకు అందించే పత్రాలపై సీఎం, మంత్రుల ఫొటోలు ఉండకూడదు. ఓటర్లను ప్రభావితం చేసేలా కొత్త సంక్షేమ పథకాలను ప్రకటించడం, కొత్త పనులకు నిధులు మంజూరు చేయడం, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించడం వంటి వాటిపై ఎన్నికల నియమావళి నిబంధనలు వర్తిస్తాయి.
ఫ్లెక్సీలు ఏర్పాటు చేయరాదు
ప్రభుత్వ భవనాలు, విద్యుత్ స్తంభాలు, బహిరంగ ప్రదేశాల్లో రాజకీయ పార్టీలకు సంబంధించిన ఫ్లెక్సీలు, పోస్టర్లు, కటౌట్లు, బ్యానర్లు ఏర్పాటు చేయడం, గోడలపై రాతలు రాయడం నిషేధం. ఇళ్లు, స్థలాల యజమానుల అనుమతి లేకుండా వారి ప్రాంగణాల్లో పార్టీ జెండాలు, బ్యానర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయరాదు. అనుమతితో ప్రచార సామగ్రి ఏర్పాటు చేసినా, అందుకు సంబంధించిన ఖర్చును అభ్యర్థి ఎన్నికల వ్యయంలో చూపించాలి.
ప్రలోభాలు చూపితే చర్యలు
ఓటర్లను ఆకట్టుకునేందుకు నగదు, మద్యం, బహుమతులు లేదా ఇతర వస్తువులను పంపిణీ చేయడం నేరం. ఓటర్లను బెదిరించడం, ప్రలోభాలకు గురిచేయడం వంటివి చేయరాదు. ఎన్నికల సమయంలో నగదు రవాణాపై అధికారులు నిఘా ఉంచుతారు. రూ.50 వేలకుపైగా నగదు తీసుకెళ్లేవారు దాని మూలానికి సంబంధించిన సరైన ఆధారాలు, పత్రాలను వెంట ఉంచుకోవడం మంచిది. నగదు తరలింపులో నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు గుర్తిస్తే, నిబంధనల ప్రకారం స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టే అవకాశం ఉంటుంది.
విద్వేష ప్రసంగాలు చేయరాదు
కులాలు, మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రసంగాలు చేయడం, ఒక వర్గంపై మరో వర్గాన్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం నిషేధం. ప్రత్యర్థుల వ్యక్తిగత జీవితంపై విమర్శలు చేయకుండా, వారి రాజకీయ విధానాలు, పనితీరుపైనే విమర్శలు చేయాలి.
మద్యం నిషేధం
పోలింగ్ ముగిసే సమయానికి ముందు 48 గంటల వ్యవధిలో మద్యం విక్రయాలు, పంపిణీపై నిషేధం అమల్లో ఉంటుంది. ఎన్నికల నియమావళి ఉల్లంఘనలను గుర్తించేందుకు ఫ్లయింగ్ స్క్వాడ్లు, పోలీసులు, ఎన్నికల అధికారులు నిఘా ఉంచుతారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటారు.


