● కలెక్టర్ హిమాన్షు శుక్లా
నెల్లూరురూరల్: పేదలు, అణగారిన వర్గాల సంక్షేమానికి జీవితాన్ని అంకితం చేసిన ఐఏఎస్ అధికారి ఎస్‌ఆర్ శంకరన్ సేవలు చిరస్మరణీయమని కలెక్టర్ హిమాన్షు శుక్లా పేర్కొన్నారు. శంకరన్ జయంతి సందర్భంగా గురువారం ఆయన సేవలను స్మరిస్తూ కలెక్టర్ ప్రకటన విడుదల చేశారు. శంకరన్ కలెక్టర్ నుంచి త్రిపుర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వరకు పలు కీలక బాధ్యతలు నిర్వహించారన్నారు. నిరాడంబర జీవనశైలి, నిజాయితీ, అణగారిన వర్గాల అభ్యున్నతి పట్ల అంకితభావంతో ప్రత్యేక గుర్తింపు పొందినట్లు చెప్పారు. ఉద్యోగ విరమణ చేసిన తర్వాత కూడా ఆయన ప్రజాసేవను కొనసాగించారన్నారు. తన పెన్షన్‌లో కొంత భాగాన్ని ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల సంక్షేమానికి అందించడంతోపాటు పేదల హక్కుల పరిరక్షణకు కృషి చేసినట్లు వెల్లడించారు. ఆయన సేవలకు గుర్తుగా నెల్లూరు కలెక్టరేట్‌లోని ఒక హాలుకు శంకరన్ హాల్‌గా నామకరణం చేసినట్లు కలెక్టర్ తెలిపారు. అధికారులు ప్రజల పట్ల బాధ్యతాయుతంగా, పారదర్శకంగా, మానవీ య దృక్పథంతో వ్యవహరించాలని శంకరన్ జీవితం చాటిచెబుతోందన్నారు.
తూపిలిపాళెం తీరంలో
అలజడి
వాకాడు: వాతావరణ మార్పుల నేపథ్యంలో వాకాడు మండలంలో ఐదురోజులుగా పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు సముద్ర అలలు ఉధృతంగా ఎగసిపడుతున్నాయి. గురువారం తూపిలిపాళెం తీరంలో అలలు పెద్ద ఎత్తున ఎగసిపడటంతో స్థానికులు, మత్స్యకారులు ఆందోళన చెందారు. ఎన్నడూ లేని విధంగా సముద్రంలో మార్పులు కనిపిస్తున్నాయని మత్స్యకారులు చెబుతున్నారు. ఇప్పటికే వర్షాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న తీర ప్రాంత ప్రజలకు అలల ఉధృతి మరింత ఆందోళన కలిగిస్తోంది. ఇలాగే కొనసాగితే చేపల వేటకు వెళ్లడం ప్రమాదకరంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మత్స్యకారులు, తీర ప్రాంత ప్రజలు సముద్రం వద్దకు వెళ్లే సమయంలో జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది.
బ్యాలెట్ బాక్స్‌లకు
మరమ్మతులు
నెల్లూరు(పొగతోట): జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నేపథ్యంలో అందుకు అవసరమైన బ్యాలెట్ బాక్సులు జెడ్పీ కార్యాలయంలో సిద్ధంగా ఉన్నాయి. ప్రస్తుతం వాటికి మరమ్మతులు చేపట్టి, పోలింగ్ నిర్వహణ కోసం మండలాలకు తరలిస్తున్నారు. ఇందులో భాగంగా గురువారం వివిధ వాహనాల్లో బ్యాలెట్ బాక్సులను మండలాలకు పంపించారు.
ట్రావెల్స్ బస్సులో
మంటలు
సీతారామపురం: మండలంలోని రంగనాయుడు పల్లి గ్రామ సమీపాన గురువారం రాత్రి ఓ ట్రావెల్స్ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. వారి కథనం మేరకు.. ఉదయగిరి నుంచి సీతారామపురం మీదుగా హైదరాబాద్‌కు ప్రయాణికులతో ఓ ట్రావెల్స్ బస్సు బయలుదేరింది. రంగనాయుడుపల్లి సమీపానికి వచ్చేసరికి ఏసీ షార్ట్ సర్క్యూట్ కారణంగా అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి ఈ ఘటనతో ప్రయాణికులు వెంటనే బస్సులో నుంచి దిగారు. ఎవరికీ ఏమీ కాలేదు. బస్సు సిబ్బంది మంటలను ఆర్పివేశారు. రాత్రి వేళలో ప్రయాణికులు గమ్యస్థానం చేరేందుకు నానా అవస్థలు పడాల్సి వచ్చింది.


