● వర్షపు నీటిలోనే పాఠశాల
● ఇబ్బందులు పడిన విద్యార్థులు
చిల్లకూరు: దసరా సెలవుల తర్వాత బడులు తెరిచారు.. కానీ కనీస సౌకర్యాలు విషయాన్ని మరిచారు. వర్షం కురిస్తే పాఠశాల ఆవరణతోపాటు తరగతి గదుల్లోకి నీరు చేరుతున్నా పట్టించుకునే పరిస్థితి కూటమి పాలనలో కరువైంది. దీంతో విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. చిల్లకూరు మండలం తొణుకుమాల పంచాయతీ పరిధిలోని ఉడతావారిపాళెం ప్రాథమిక పాఠశాల దుస్థితి ఇందుకు నిదర్శనం. ఈ బడిలో సుమారు 30 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. రెండు రోజులుగా కురిసిన వర్షాలకు పాఠశాల ఆవరణలోనే కాకుండా తరగతి గదుల్లోనూ నీరు చేరింది. దసరా సెలవుల అనంతరం గురువారం పాఠశాలలు పునఃప్రారంభం కావడంతో ఉపాధ్యాయులు వచ్చారు. గదుల్లో వర్షపు నీరు నిలిచి ఉండటాన్ని గమనించి పిల్లల్ని వరండాలో కూర్చోబెట్టి పాఠాలు చెప్పాల్సి వచ్చింది.
పట్టించుకుంటే కదా..
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ‘నాడు – నేడు’ కార్యక్రమం ద్వారా పాఠశాలల అభివృద్ధికి చర్యలు చేపట్టారు. కూటమి పాలనలోనూ శిథిలావస్థలో ఉన్న బడులకు మరమ్మతులు చేసి, విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పి స్తారని తల్లిదండ్రులు ఆశించారు. అయితే ఉడతావారిపాళెం పాఠశాలలో పరిస్థితి చూస్తే ఆ ఆశలు నెరవేరలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. స్థానిక ఎమ్మెల్యే పాశం సునీల్‌కుమార్ కానీ రెండున్నర సంవత్సరాల్లో స్కూళ్ల అభివృద్ధి గురించి మాత్రం పట్టించుకోలేదు. అదే వ్యక్తి నేడు గూడూరులో స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నాడు. కుట్రలతో ఎన్నికల్లో గెలవాలని పెట్టిన శ్రద్ధ నియోజకవర్గ అభివృద్ధిపై పెట్టి ఉంటే బాగుంటుందని ప్రజలు చర్చించుకుంటున్నారు.


