నెల్లూరురూరల్: స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా జరిగేందుకు పటిష్ట భద్రతా చర్యలు చేపట్టినట్లు కలెక్టర్ హిమాన్షు శుక్లా శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని అన్ని నామినేషన్ కేంద్రాల వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకున్నామని, నామినేషన్ కేంద్రాలు, పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహిస్తామని స్పష్టం చేశారు.
ఫిర్యాదులు, సందేహాల
నివృత్తికి కంట్రోల్ రూమ్
నెల్లూరురూరల్: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలపై ఫిర్యాదులు స్వీకరించేందుకు కలెక్టరేట్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎన్నికలాధికారి, కలెక్టర్ హిమాన్షు శుక్లా శనివారం తెలిపారు. అలాగే ఎన్నికల ప్రక్రియపై సందేహాలు, ప్రశ్నలుంటే నివృత్తి చేసుకునేందుకు ప్రత్యేక హెల్ప్డెస్క్ లేదా కాల్ సెంటర్ (086123 31261) అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. ప్రజలు వినియోగించుకోవాలని సూచించారు.
రాంగ్ రూట్లో వెళ్తూ.. లారీని ఢీకొని..
● వ్యక్తి మృతి
కోవూరు: రాంగ్ రూట్లో వెళ్తున్న ఆటో.. ఎదురుగా వస్తున్న లారీని ఢీకొనడంతో ఒకరు మృతిచెందిన ఘటన కోవూరు సమీపంలోని ఎన్ఎస్సార్ కాలనీ వద్ద శనివారం జరిగింది. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని శాంతినగర్కు చెందిన కుంటూరు వెంకటసుబ్బయ్య (60) కూలి పనులు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన ఆటోలో నెల్లూరు నుంచి రాజుపాళెం వైపు రాంగ్ రూట్లో వెళ్తున్నారు. హైదరాబాద్ నుంచి నెల్లూరు వైపు వస్తున్న లారీని ఢీకొనడంతో ఆయన అక్కడికక్కడే మరణించారు. సమాచారం అందుకున్న హైవే పెట్రోలింగ్ సిబ్బంది స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
స్థానిక ఎన్నికలపై రేపు శిక్షణ
నెల్లూరు(పొగతోట): జెడ్పీటీసీ, ఎంపీటీసీల ఎన్నికలకు సంబంధించి 11 వేల మంది ఉద్యోగులను ఎంపిక చేశారు. ఈ క్రమంలో అధికారులు, మాస్టర్ ట్రైనర్లకు ఈనెల 19వ తేదీన జెడ్పీ సమావేశ మందిరంలో ప్రత్యేక శిక్షణా తరగతులు నిర్వహించనున్నారు. శిక్షణ తర్వాత మాస్టర్ ట్రైనర్లు మండలాల్లో ఎన్నికల విధులకు హాజరయ్యే ఉద్యోగులకు తరగతులు నిర్వహిస్తారు. ఈ క్రమంలో ఏర్పాట్లను జెడ్పీ సీఈఓ మధుసూదన్, డిప్యూటీ సీఈఓ బ్రహ్మయ్య పర్యవేక్షిస్తున్నారు.


