నెల్లూరురూరల్: వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు సమష్టిగా పనిచేస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధ్యమని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి పిలుపునిచ్చారు. నగరంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో ముత్తుకూరు మండల నాయకులతో శనివారం సమావేశమై అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల వ్యూహాలు, క్షేత్రస్థాయి పరిస్థితులపై చర్చించారు. ఎన్నికల బాధ్యతలను ఇప్పటి నుంచే చేపట్టి, గ్రామస్థాయిలో పార్టీని బలోపేతం చేసేలా కార్యాచరణ సిద్ధం చేసుకోవాలన్నారు. ప్రతి ఓటరును కలిసి, పార్టీ అభ్యర్థులు గెలిస్తే గ్రామాల్లో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలను వివరించాలన్నారు. టికెట్ ఎవరికొచ్చినా వ్యక్తిగత విభేదాలను పక్కనబెట్టి పార్టీ అభ్యర్థి విజయానికి పనిచేయాలని స్పష్టం చేశారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలు, అభ్యర్థులపై అక్రమ కేసులు నమోదు చేస్తే చట్టపరంగా పోరాడుతామని తెలిపారు.


