రాపూరు: పెంచలకోనలోని పెనుశిల లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో నిర్వహిస్తున్న పవిత్రోత్సవాలు శనివారం వైభవంగా ముగిశాయి. పెనుశిల లక్ష్మీనరసింహస్వామి, ఆదిలక్ష్మీదేవి, చెంచులక్ష్మీదేవి అమ్మవార్ల ఆలయాల్లో నిత్యం చేసే సేవల్లో తెలిసీ తెలియక కలిగిన దోషాల నివారణ కోసం పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఇందులో భాగంగా శనివారం ఉదయం శ్రీవారి క్రేన్ మండపంలో స్వామివారికి స్నపన తిరుమంజనం, చతుస్థానార్చన, వేద, దివ్య, ప్రబంధ పారాయణం, మహా పూర్ణాహుతి, పవిత్రాల విసర్జన కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం శేష వాహనంపై స్వామి, అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను కొలువుదీర్చి వివిధ రకాల పుష్పాలు, ఆభరణాలతో శోభాయమానంగా అలంకరించి పెంచలకోన మాడవీధుల్లో క్షేత్రోత్సవం నిర్వహించారు.


