● రక్తనాళాల్లో అడ్డంకులతో
కాళ్లకు చేరని రక్తం
● చికిత్స ఆలస్యమైతే కాలు
తీసేయాల్సిన పరిస్థితి
● కాళ్లకు రక్త ప్రసరణపై అవగాహన మాసోత్సవంగా సెప్టెంబర్
●
నెల్లూరు(అర్బన్): మన శరీరంలో గుండె నుంచి కాళ్లకు రక్తాన్ని తీసుకెళ్లే దమనులు, తిరిగి గుండెకు రక్తాన్ని తీసుకొచ్చే సిరలు సక్రమంగా పనిచేయకపోవడాన్ని రక్తప్రసరణ లోపం అంటాం. వైద్య భాషలో పెరిపెరల్ ఆర్టరీ డిసీజ్(పీఏడీ)గా పేర్కొంటాం. 40 ఏళ్లు దాటిన వారిలో.. బీపీ, షుగర్ ఉన్న వారిలో ఈ సమస్య ఎక్కువగా వస్తుంది. చికిత్స ఆలస్యమైతే కాళ్లకు రక్త ప్రసరణ సరిగా అందక పుండ్లు పడుతాయి. అవి మానడం కష్టం. పైగా ఇన్‌ఫెక్షన్ సోకి ప్రమాదంగా మారుతున్న నేపథ్యంలో కాళ్లనే తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ప్రజల్లో దీనిపట్ల పూర్తిస్థాయిలో అవగాహన కల్పించేందుకు వాస్కులర్ సొసైటీ కృషి చేస్తోంది. ప్రభుత్వం సెప్టెంబర్ మాసాన్ని కాళ్లకు రక్తప్రసరణపై అవగాహన మాసంగా ప్రకటించి చైతన్య కార్యక్రమాలు చేపడుతోంది.
నిర్లక్ష్యం చేయొద్దు
కాళ్లలో నొప్పి వస్తోంది.. నడిచేటప్పుడు పిక్కలు పట్టేస్తున్నాయి.. కాసేపు విశ్రాంతి తీసుకుంటే తగ్గిపోతుందంటూ చాలా మంది పట్టించుకోరు. అయితే ఈ లక్షణాలు రక్తప్రసరణ తగ్గిపోవడానికి తొలి సంకేతాలు కావచ్చు. రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోవడం వల్ల కాళ్లలోని కణజాలానికి రక్త ప్రసరణ అందదు. పరిస్థితి ముదిరితే పుండ్లు ఏర్పడి, అవి గాంగ్రిన్(కుళ్లడం)కు దారి తీయవచ్చు. కాళ్లకు రక్తప్రసరణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈనెలలో నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమాల నేపథ్యంలో వైద్యనిపుణులు ముందస్తు జాగ్రత్తలపై దృష్టి సారిస్తున్నారు.
గమనించాల్సిన
లక్షణాలు
నడిచేటప్పుడు పిక్కలు, తొడలు, పాదాల్లో నొప్పి రావడం.. పాదాలు తిమ్మిరిగా ఉండటం, మొద్దుబారడం, పాదాలు చల్లగా ఉండటం పాదం లేదా వేళ్ల రంగు నీలం లేదా నలుపుగా మారుతాయి. అలాగే కాళ్లపై వెంట్రుకలు తగ్గడం, గోళ్లు నెమ్మదిగా పెరగడం, చిన్నగాయాలు, పుండ్లు ఆలస్యంగా మానడం, రాత్రివేళ పాదాల్లో తీవ్రమైన నొప్పి రావడం వంటివి దీని ప్రధాన లక్షణాలు.
తొలిదశలో గుర్తిస్తే మేలు
ప్రతి రక్త ప్రసరణ సమస్యకు కాలు తొలగించాల్సిన అవసరం లేదు. తొలిదశలో జబ్బును గుర్తిస్తే మందులు, జీవనశైలి మార్పులు, అవసరమైతే యాంజియోప్లాస్టి లేదా ఇతర రక్తనాళాల చికిత్సలతో రోగాన్ని నియంత్రించవచ్చు. కణ జాలం పూర్తిగా దెబ్బతిని గాంగ్రిన్ ఏర్పడినప్పుడు మాత్రమే కాలును తొలగించాల్సి ఉంటుంది.
14 శాతం మంది
బాధితులు
కాళ్లకు రక్తప్రసరణ తగ్గడం వల్ల ప్రపంచ
వ్యాప్తంగా 12 నుంచి 14 శాతం ప్రజలు బాధపడుతున్నారు. నిమిషానికి ఇద్దరు వంతున ఈ సమస్యతో కాళ్లను పోగొట్టుకుంటున్నారు. బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ ఉన్నవారు, పొగతాగేవారికి ఇలాంటి సమస్యలు ఎక్కువ.


