వెంకటాచలం: ప్రజల రక్షణలో పోలీసుల పాత్ర చాలా కీలకమని.. విధి నిర్వహణలో సేవాభావం, విలువలు, క్రమశిక్షణ, నిబద్ధతతో పనిచేయా లని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పేర్కొన్నారు. మండలంలోని చెముడుగుంటలో గల జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రంలో ట్రెయినింగ్‌ను పూర్తి చేసుకున్న 176 మంది పోలీస్ కానిస్టేబుళ్లకు పాసింగ్ అవుట్ పరేడ్‌ను శనివారం నిర్వహించారు. ప్రతిభ చూపిన వారికి మెడళ్లు, జ్ఞాపికలను అందజేశారు. ఎస్పీ అజిత వేజెండ్ల, ఏఎస్పీ, శిక్షణ కళాశాల ప్రిన్సిపల్ సౌజన్య, డీఎస్పీ, వైస్ ప్రిన్సిపల్ గిరిధర్‌రావు తదితరులు పాల్గొన్నారు.
ఎస్సెమ్సీ ఎన్నికలు
ఒకటికి వాయిదా
నెల్లూరు (టౌన్): స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ (ఎస్సెమ్సీ) ఎన్నికలను అక్టోబర్ ఒకటికి వాయిదా వేశామని డీఈఓ బాలాజీరావు, సమగ్రశిక్ష ఏపీసీ వెంకటసుబ్బయ్య శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. తొలుత దీన్ని మంగళవారం నిర్వహించేందుకు నిర్ణయించామని, అయితే పరిపాలన కారణాల రీత్యా వాయిదా వేశామని చెప్పారు. ఎన్నికలను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించడంతో పాటు అన్ని ఏర్పాట్లను చేయాలని సూచించారు.
29న ట్రాఫిక్ మళ్లింపు
వరికుంటపాడు: మండలంలోని రామాపురం పంచాయతీలో ఈ నెల 29న నిర్వహించనున్న జీరామ్‌జీ పల్లె పండగ – 3.0 కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హాజరుకానున్న నేపథ్యంలో ట్రాఫిక్‌ను మళ్లించనున్నామని ఉదయగిరి సీఐ అంకమరావు పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం ఆయన మాట్లాడారు. కార్యక్రమం జరిగే రోజున 565వ జాతీయ రహదారిపై రాకపోకలను పూర్తిగా నిలిపేయనున్నామని చెప్పారు. విజయవాడవైపు వెళ్లే వాహనాలను దుత్తలూరు నుంచి కావలి మీదుగా ఒంగోలు వెళ్లాలని పేర్కొన్నారు. పామూరు వైపు వెళ్లే వాహనాలు ఉదయగిరి, సీతారామపురం, సీఎస్‌పురం మీదుగా వెళ్లాలని సూచించారు. ఎస్సై మధుసూదన్‌రావు పాల్గొన్నారు.
రేపటి పీజీఆర్‌ఎస్ రద్దు
నెల్లూరు రూరల్: నగరంలోని కలెక్టరేట్లో ఈ సోమవారం నిర్వహించాల్సిన ప్రజా సమస్యల పరిష్కార వేదికను రద్దు చేశామని కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. ఈ మేరకు ఒక ప్రకటనను శనివారం విడుదల చేశారు.
శ్రీవారి దర్శనానికి
20 గంటలు
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ శనివారం ఎక్కువగా ఉంది. క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్ట్‌మెంట్లు నిండిపోయి.. శిలాతోరణం వద్దకు క్యూ చేరుకుంది. స్వామివారిని 66,014 మంది శుక్రవారం అర్ధరాత్రి వరకు దర్శించుకున్నారు. టైమ్ స్లాట్ టికెట్లున్న వారికి సకాలంలో దర్శనం లభిస్తోంది. ఇవి లేని వారికి 20 గంటల సమయం పడుతోంది.


