నెల్లూరు సిటీ: బుల్లెట్ తగిలి వ్యక్తి గాయపడిన ఘటన నెల్లూరు రూరల్ పరిధిలోని ఆమంచర్లలో జరిగింది. పోలీసుల కథనం మేరకు.. ఆమంచర్ల వద్ద పోలీస్ ఫైరింగ్ రేంజ్ ఉంది. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ జిల్లా పోలీస్ కార్యాలయం నుంచి అనుమతి తీసుకుని ఫైరింగ్ ప్రాక్టీస్ చేస్తుంది. దీనికి సమీపంలో నిమ్మతోట ఉంది. అందులో రూరల్ పరిధిలోని కొల్లంపూడికి చెందిన సీతారామయ్య పనిచేస్తున్నాడు. మంగళవారం అతను తోటలో ఉండగా బుల్లెట్ తగిలింది. యజమానికి సమాచారం తెలియడంతో 108 అంబులెన్స్‌లో బాధితుడిని హాస్పిటల్‌కు తరలించాడు. ఫైరింగ్ సమయంలో బుల్లెట్ సీతారామయ్య ఛాతిలో లేదా తలకు తగిలి ఉంటే ప్రాణాలకు ముప్పు వాటిల్లేది. బాధితుడు వేదాయపాళెం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు.
రెడ్‌క్రాస్ సభ్యులు
వివరాలు సరిచూసుకోవాలి
నెల్లూరు(అర్బన్): ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ నెల్లూరు జిల్లా శాఖలో జీవితకాల సభ్యులుగా నమోదైన వారు తమ పేరు, ఇతర వివరాలను నగరంలోని రెడ్‌క్రాస్ కార్యాలయంలో సరిచూసుకోవాలని సొసైటీ సెక్రటరీ మస్తానయ్య మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. సభ్యుల ఫొటోలు నమోదు కాకపోయినా, ఇప్పటికే ఉన్న వివరాల్లో మార్పులు, సవరణలు చేయాల్సి ఉన్నా వెంటనే కార్యాలయానికి వచ్చి సరిచేసుకోవాలని కోరారు.
ఇంట్లో విద్యుత్ పనులు చేస్తూ..
● షాక్‌తో వ్యక్తి మృతి
చిల్లకూరు: విద్యుత్ పనులు చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు షాక్‌కు గురై ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన మంగళవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. మండలంలోని కలవకొండ గ్రామంలో బూదూరు రమేష్ (35) అనే వ్యక్తి తన అన్న ఇంట్లో విద్యుత్ పనులు చేస్తున్నాడు. ఈ సమయంలో షాక్‌కు గురయ్యాడు. దీంతో కుటుంబ సభ్యులు అతడిని చికిత్స నిమిత్తం గూడూరు ఏరియా ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందాడని వైద్యులు తెలిపారు. చిల్లకూరు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు వివరాలను సేకరించారు. కేసు నమోదు చేశారు. రమేష్‌కు భార్య, ఇద్దరు పిల్లలున్నారు.
కండలేరులో
18.22 టీఎంసీలు
రాపూరు: కండలేరు జలాశయంలో మంగళవారం నాటికి 18.22 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు జలాశయం ఈఈ గజేంద్రరెడ్డి తెలిపారు. కండలేరు నుంచి సత్యసాయి గంగ కాలువకు 1,500, లోలెవల్ కాలువకు 50, పిన్నేరు కాలువకు 5, మొదటి బ్రాంచ్ కాలువకు 60 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు.


