● వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరి మృతి
ఆత్మకూరు: ప్రైవేట్ దుకాణంలో పనిచేస్తూ కుటుంబానికి అండగా ఉన్న యువతి ఆటోలో ప్రయాణిస్తూ అది బోల్తాపడి మృతిచెందిన ఘటన ఆత్మకూరులో మంగళవారం చోటు చేసుకుంది. ఎస్సై జంపానికుమార్ కథనం మేరకు.. మున్సిపల్ పరిధిలోని వెంకట్రావుపల్లి దళిత కాలనీకి చెందిన బొగ్గవరపు మహాలక్ష్మి (23), నాగేంద్రబాబు దంపతులు. ఆమె పట్టణంలోని ఓ రెడీమేడ్ వస్త్ర దుకాణంలో పనిచేస్తూ కుటుంబ పోషణకు తనవంతుగా కష్టపడుతోంది. ఈ నేపథ్యంలో మంగళవారం మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వెళ్లి తిరిగి విధులకు హాజరయ్యేందుకు ఆటోలో బయలుదేరింది. డ్రైవర్ ప్రభు వాహనాన్ని అజాగ్రత్తగా, నిర్లక్ష్యంగా నడపడంతో ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో మహాలక్ష్మి రోడ్డుపై పడిపోయి తీవ్ర రక్తగాయాలయ్యాయి. ఆమెను వెంటనే సమీపంలోని వారు ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయింది. సమాచారం అందుకున్న ఎస్సై కేసు నమోదు చేశారు.
గుర్తుతెలియని వాహనం ఢీకొని..
దగదర్తి: గుర్తుతెలియని వాహనం ఢీకొన్న ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన అల్లూరు రోడ్డు జాతీయ రహదారిపై ఉన్న రైల్వే వంతెన వద్ద చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. పశ్చిమ బెంగాల్‌కు చెందిన దీపంకర్ బర్మన్ అనే యువకుడు సోమవారం రాత్రి అల్లూరు రోడ్డు రైల్వే వంతెనపై నెల్లూరు వైపు నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఈ క్రమంలో గుర్తుతెలియని వాహనం అతడిని ఢీకొట్టింది. ప్రమాదంలో బర్మన్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న హైవే మొబైల్, దగదర్తి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రుడిని హైవే అంబులెన్స్‌లో కావలి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. మృతుడి వద్ద లభించిన ఆధార్ కార్డు ఆధారంగా పశ్చిమ బెంగాల్ వాసిగా గుర్తించారు. అక్కడి పోలీస్‌స్టేషన్‌లో తెలియజేసి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చేలా చర్యలు తీసుకున్నారు. వయసు 35 సంవత్సరాలు ఉండొచ్చని భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశామని ఎస్సై మహేంద్ర తెలిపారు.


