కోవూరు: కోవూరుతో పాటు కొడవలూరు మండలం నార్తురాజుపాళెం పరిధిలోని హోటళ్లు, దాబాలు, బేకరీలు, జ్యూస్ షాపులు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లపై శనివారం ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. నిబంధనలు ఉల్లంఘించిన ఐదు హోటళ్లపై కేసులు నమోదు చేశారు. అలాగే నాలుగు ఫుడ్ సెంటర్లకు నోటీసులు జారీ చేశారు. 150 కేజీల నాసిరకం ఐస్‌తో పాటు నాలుగు కేజీల రంగులు కలిపిన చెకోడీలు, ఐదు కిలోల గవ్వలు, నాలుగు కేజీల వేరుశనగ పప్పులు, పది కేజీల కుళ్లిన అరటిపండ్లను ధ్వంసం చేశారు. అదేవిధంగా కృత్రిమ రంగులు కలిపిన చికెన్, చికెన్ బిర్యానీ, హాఫ్ బాయిల్ చపాతీలు, పరోటాలు, పాడైన కూరగాయలు, రంగులు కలిపిన గోబీ వంటి ఆహార పదార్థాలను గుర్తించి నిర్వీర్యం చేశారు. వ్యాపారులు తప్పనిసరిగా లైసెన్స్‌లు కలిగి ఉండాలని, వంట గదులు, హోటల్ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని అధికారులు సూచించారు. తనిఖీల్లో ఫుడ్ సేఫ్టీ కంట్రోలర్ జి.వెంకటేశ్వరరావు, అధికారులు డాక్టర్ డి.నీరజ, ఎం.ప్రణతి ఫ్లోరా పాల్గొన్నారు.


