నెల్లూరురూరల్: ఉపాధ్యాయ వృత్తి సాధారణ ఉద్యోగం కాదని, గొప్ప బాధ్యతతో కూడిన సేవ అని కలెక్టర్ హిమాన్షు శుక్లా అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం నెల్లూరు కలెక్టరేట్‌లోని తిక్కన ప్రాంగణంలో పాఠశాల విద్యాశాఖ, సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో గురుపూజోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. తొలుత జ్యోతి ప్రజ్వలన అనంతరం భారత మాజీ రాష్ట్రపతి, ప్రముఖ విద్యావేత్త డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ హిమాన్షు శుక్లా మాట్లాడుతూ ఒక మంచి ఉపా ధ్యాయుడు ఒక విద్యార్థి జీవితాన్ని మాత్రమే కాదు.. ఒక కుటుంబం, సమాజం, దేశ భవిష్యత్‌ను మార్చగలడన్నారు. విద్యార్థులకు పాఠ్యాంశాలను బోధించడంతో పాటు మంచి మనిషిగా ఎలా ఎదగాలనే విషయాలను కూడా ఉపాధ్యాయులు నేర్పాలన్నారు. నేటి విద్యార్థులే రేపటి వైద్యులు, ఇంజినీర్లు, శాస్త్రవేత్తలు, అధికారులు, ప్రజాప్రతినిధులు, పారిశ్రామిక వేత్తలుగా ఎదుగుతారని, వారి వ్యక్తిత్వ వికాసంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమని చెప్పారు.
విలువలతో కూడిన విద్య అందించాలి
– ఆనం అరుణమ్మ
జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ ఆనం అరుణమ్మ మాట్లాడుతూ భారతీయ సంస్కృతిలో గురువులకు అత్యున్నత స్థానం ఉందన్నారు. సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో గొప్పదన్నారు. విద్యార్థులకు పాఠ్యాంశాలతో పాటు విలువలతో కూడిన విద్యను అందించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. ఎమ్మెల్సీ బీద రవిచంద్ర మాట్లాడుతూ గురువుల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు ప్రభుత్వం విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతోందన్నారు.
58 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు సత్కారం
ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా ఉత్తమ సేవలు అందించిన 58 మంది ఉపాధ్యాయులకు జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ప్రదానం చేసి ఘనంగా సత్కరించారు. వీరిలో 20 మంది సెకండరీ గ్రేడ్ టీచర్లు, 20 మంది స్కూల్ అసిస్టెంట్లు, 18 మంది ప్రధానోపాధ్యాయులు ఉన్నారు. కార్యక్రమంలో డీఈఓ ఆర్. బాలాజీరావు, సమగ్ర శిక్ష ఏపీసీ వెంకటసుబ్బయ్య, విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థుల భవిష్యత్‌కు
ఉపాధ్యాయులే మార్గదర్శకులు
కలెక్టర్ హిమాన్షు శుక్లా
జిల్లా వ్యాప్తంగా 58 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు ఘన సత్కారం


