6న జిల్లా మాస్టర్‌ అథ్లెటిక్స్‌ ఎంపికలు | - | Sakshi
Sakshi News home page

6న జిల్లా మాస్టర్‌ అథ్లెటిక్స్‌ ఎంపికలు

Sep 4 2026 11:50 PM | Updated on Sep 4 2026 11:50 PM

నెల్లూరు(టౌన్‌): నెల్లూరులోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో ఈ నెల 6వ తేదీన జిల్లా మాస్టర్‌ అథ్లెటిక్స్‌ ఎంపికలు నిర్వహించనున్నట్లు జిల్లా మాస్టర్స్‌ అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షురాలు ఎం.విజయలక్ష్మీరెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికలకు 30 ఏళ్ల వయస్సు పైబడిన పురుషులు, మహిళలు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న వారు ఉదయం 8 గంటల్లోపు స్టేడియానికి చేరుకోవాలని సూచించారు. జిల్లాస్థాయిలో ఎంపికై న వారు వచ్చేనెల 10, 11 తేదీల్లో గుంటూరులోని నాగార్జున యూనివర్సిటీ మైదానంలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని వెల్లడించారు.

కుటుంబ సభ్యులకు

మహిళల అప్పగింత

నెల్లూరు(క్రైమ్‌): వివిధ కారాణాలతో బాలాజీ నగర్‌, సైదాపురం, వింజమూరు పోలీస్‌స్టేషన్ల పరిధిలో ఐదుగురు మహిళలు తప్పిపోయారు. మహిళా పోలీసుస్టేషన్‌ డీఎస్పీ కె.వేమారెడ్డి ఆధ్వర్యంలో యాంటీ హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ యూనిట్‌ (ఏహెచ్‌టీయూ) సాంకేతిక ఆధారాలు, క్షేత్రస్థాయి సమాచారం, వివిధ విభాగాల సమన్వయంతో వారి ఆచూకీని గుర్తించి ఆయా ప్రాంత పోలీసుల ద్వారా కుటుంబ సభ్యుల చెంతకు చేర్చారు. శుక్రవారం డీఎస్పీ వేమారెడ్డి మాట్లాడుతూ మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నామన్నారు. ఎవరైనా తప్పిపోతే ఆలస్యం చేయకుండా కుటుంబ సభ్యులు స్థానిక పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఇంటికి చేరకుండానే..

బైక్‌ ఢీకొని వృద్ధురాలి మృతి

నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణం

అనుమసముద్రంపేట: పని నుంచి ఇంటికి బయలుదేరిన వృద్ధురాలిని మోటార్‌బైక్‌ ఢీకొనడంతో మృతిచెందిన ఘటన మండలంలోని దుబగుంట గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. దుబగుంట గ్రామానికి చెందిన కొండపరెడ్డి మహాలక్ష్మమ్మ (69), తన స్నేహితురాలు ఎడ్ల రమతో కలిసి ముత్తురాలు గ్రామ పరిధిలోని తోటకు వ్యవసాయ పనుల నిమిత్తం వెళ్లింది. పనులు ముగించుకుని ఇద్దరూ నడుచుకుంటూ దుబాగుంటకు తిరిగి వస్తున్నారు. ఈక్రమంలో అవినాష్‌రెడ్డి అనే వ్యక్తి నిర్లక్ష్యంగా బైక్‌ నడుపుతూ మహాలక్ష్మమ్మను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ఆమె తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే రమ, స్థానికుల చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం నెల్లూరులోని అపోలో ఆస్పత్రికి తీసుకెళ్లగా వైద్యులు పరీక్షించి అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

వైఎస్సార్‌సీపీ ఫ్లెక్సీ

చించివేతపై ఫిర్యాదు

జలదంకి(కలిగిరి): జలదంకి మండలం బ్రాహ్మణక్రాక అగ్రహారంలో దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని గురువారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చించివేశారు. ఈ ఘటనపై వైఎస్సార్‌సీపీ రాష్ట్ర పంచాయతీరాజ్‌ వింగ్‌ కార్యదర్శి దేవరపల్లి రఘురామిరెడ్డి శుక్రవారం జలదంకి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ పార్టీ మండల కన్వీనర్‌ ఇస్కా మదన్‌మోహన్‌రెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్‌ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని చించి వేయడం మంచి సంస్కృతి కాదన్నారు. ఇలాంటి చర్యలతో గ్రామాల్లో గొడవలు, వివాదాలు జరిగే ఆస్కారం ఉందన్నారు. పోలీసులు ఫ్లెక్సీ చించి వేసిన వారిని పట్టుకోవాలన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు.

కండలేరులో

18.82 టీఎంసీలు

రాపూరు: కండలేరు జలాశయంలో శుక్రవారం నాటికి 18.82 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు జలాశయం ఈఈ గజేంద్రరెడ్డి తెలిపారు. కండలేరు నుంచి సత్యసాయి గంగ కాలువకు 1,500, లోలెవల్‌ కాలువకు 30, పిన్నేరు కాలువకు 5, మొదటి బ్రాంచ్‌ కాలువకు 60 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement