మెడికల్‌ సంఘాన్ని విస్మరించడం బాధాకరం | - | Sakshi
Sakshi News home page

మెడికల్‌ సంఘాన్ని విస్మరించడం బాధాకరం

Sep 4 2026 11:50 PM | Updated on Sep 4 2026 11:50 PM

ఏపీ హంస జిల్లా అధ్యక్షుడు సుధాకర్‌రావు

నెల్లూరు(అర్బన్‌): ‘ఉద్యోగుల ఆందోళనల నేపథ్యంలో ఎట్టకేలకు వివిధ సంఘాల నాయకులను ప్రభుత్వం చర్చలకు పిలవడం స్వాగతించదగిన పరిణామం. అయితే అత్యధికంగా అధికారులు, వైద్య ఉద్యోగులు ఉండే సంఘాన్ని పిలవకపోవడం బాధాకరం’ అని ఆంధ్రప్రదేశ్‌ హెల్త్‌ అడ్మినిస్ట్రేషన్‌ మెడికల్‌ సర్వీసెస్‌ అసోసియేషన్‌ (ఏపీ హంస) జిల్లా ప్రధాన కార్యదర్శి చేజర్ల సుధాకర్‌రావు పేర్కొన్నారు. శుక్రవారం నగరంలోని హరనాథపురంలోని ఆ సంఘం కార్యాలయంలో జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎంతో జరిగే సమావేశానికి ఉపాధ్యాయులు, రెవెన్యూ, రవాణా తదితర రంగాలకు చెందిన అసోసియేషన్ల నాయకులనే ఆ హ్వానించారన్నారు. రాష్ట్ర వైద్యశాఖలో వైద్యులు, నర్సింగ్‌ సిబ్బంది, పారామెడికల్‌ సిబ్బంది, ఇతర ఆరోగ్యశాఖ సిబ్బందితో కూడిన లక్షలాది మంది ఉద్యోగులున్నారన్నారు. వీరి సమస్యలపై పోరాడుతున్న మెడికల్‌, హెల్త్‌ డిపార్ట్‌మెంట్‌కు చెందిన గుర్తింపు పొందిన హంస లాంటి సంఘాలను ఎందుకు పిలవలేదనే ప్రశ్న ఉద్యోగ వర్గాల్లో ఉత్పన్నమైందన్నారు. మెడికల్‌, హెల్త్‌ ఉద్యోగులకు సంబంధించిన పోస్టుల సర్దుబాటు, కేడర్‌ సమస్యలు, పదోన్నతులు, బదిలీలు, సర్వీస్‌ సమస్యలు, సిబ్బంది కొరత, పనిభారం తదితర అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలంటే వైద్య సంఘానికి కూడా అవకాశం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యమంత్రి పునరాలోచన చేసి తక్షణమే ఏపీ హంస రాష్ట్ర అధ్యక్షుడు అరవపాల్‌కు అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో ఆ సంఘం జిల్లా సెక్రటరీ కమల్‌కిరణ్‌, గౌరవ సలహాదారు అరవ పరిమళ, జిల్లా పబ్లిసిటీ సెక్రటరీ మజార్‌, సిటీ కార్యదర్శి గౌస్‌బాషా, వాకాడు తాలూకా ప్రెసిడెంట్‌ నాగయ్య, ఉపాధ్యక్షులు జయలక్ష్మి, లావణ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement