ఉత్తమ బోధనతో..
● నేడు జిల్లా స్థాయి గురుపూజోత్సవం
● 58 మందికి జిల్లా స్థాయి
● నలుగురికి రాష్ట్ర స్థాయి ఉత్తమ
ఉపాధ్యాయ అవార్డులు
నెల్లూరులోని దర్గామిట్ట డీఎస్సార్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ పనిచేస్తున్న ఎం.ధనుంజయరావు జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికయ్యారు. విద్యార్థుల అభ్యసనా సామర్థ్యాల పెంపు, బోధనలో ఉత్తమ పద్ధతుల ఆచరణ, పాఠశాల అభివృద్ధికి కృషి చేసినందుకు ఈయనను అవార్డుకు ఎంపిక చేశారు.
నెల్లూరు (టౌన్): భారతీయ సంస్కృతిలో గురువుల స్థానం ఎంతో విశిష్టమైంది. తల్లిదండ్రుల తర్వాత స్థానం వారిదే. మట్టి అనే అజ్ఞానం నుంచి జ్ఞానవంతులనే మాణిక్యాలను వెలికితీసే వారు గురువులు. శిష్యుల ఎదుగుదలను తనివితీరా అస్వాదించే నిస్వార్థ జీవి. విద్యార్థుల భవితకు బంగారు బాటలు వేసే గురువులను గౌరవించడం అందరి బాధ్యత. ఎందరికో విద్యా బుద్ధులు నేర్పి భరత మాతకు ముద్దు బిడ్డలు అందించిన మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని గురుపూజోత్సవంగా జరుపుకోవడం జాతికి గర్వకారణం. నేడు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా బోధన, సమాజం, వివిధ రంగాల్లో ఉత్తమ సేవలు అందించిన జిల్లాలోని పలువురు ఉపాధ్యాయులు జిల్లా, రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు ఎంపికయ్యారు.
58 మంది ఎంపిక
జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు 58 మందిని ఎంపిక చేశారు. వీరిలో 18 మంది గ్రేడ్–2 హెడ్‌మాస్టర్లు, 20 మంది స్కూల్ అసిస్టెంట్లు, 20 మంది సెకండరీ గ్రేడ్ టీచర్లు ఉన్నారు. రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు జిల్లా నుంచి నలుగురు ఎంపికయ్యారు. వీరిలో వరిగొండ జెడ్పీ హెచ్‌ఎస్‌కు చెందిన బయాలజీ ఉపాధ్యాయుడు యర్రగుంటి శ్రీనివాసులు, అల్లీపురంలోని ఎస్‌ఎస్సార్ జెడ్పీహెచ్‌ఎస్‌కు చెందిన ఫిజిక్స్ ఉపాధ్యాయిని ఎస్ రాజేశ్వరి, నెల్లూరులోని కర్ణాలమిట్ట మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నత పాఠశాల సోషల్ ఉపాధ్యాయుడు పనిచేస్తున్న ఆరుముళ్ల మాల్యాద్రి, కంటేపల్లి ఎంపీపీఎస్‌కు చెందిన ఉపాధ్యాయుడు జగన్నాఽథం రామ్మోహన్ ఉన్నారు.
● కలెక్టరేట్‌లోని తిక్కన ప్రాంగణంలో జిల్లా విద్యాశాఖ అధ్వర్యంలో గురుపూజోత్సవ వేడుకలను శనివారం ఉదయం 10 గంటల నుంచి నిర్వహించనున్నారు. అవార్డులకు ఎంపికైన ఉపాధ్యాయులు ఉదయం 8.30 గంటలకు రిపోర్టు చేయాలి.


