● కలెక్టర్ హిమాన్షు శుక్లా
సంగం: గ్రామాల్లోని వాస్తవ పరిస్థితులను క్షేత్రస్థాయిలో తెలుసుకొని.. ప్రజలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను గుర్తించి.. సాధ్యమైనంత వరకు అక్కడికక్కడే పరిష్కరించడమే పల్లె వీక్షణ కార్యక్రమ ప్రధాన లక్ష్యమని కలెక్టర్ హిమాన్షు శుక్లా పేర్కొన్నారు. మండలంలోని మక్తాపురంలో గురువారం నిర్వహించిన పల్లె వీక్షణ కార్యక్రమంలో భాగంగా గ్రామంలో కలెక్టర్ విస్తృతంగా పర్యటించారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు తీరును పరిశీలించడంతో పాటు రైతులు, గ్రామస్తులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. పలు రెవెన్యూ సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించడంతో పాటు పది మంది లబ్ధిదారులకు పింఛన్లను మంజూరు చేశారు. మక్తాపురంలో ధాన్యాన్ని నిల్వ చేసుకునేందుకు గోడౌన్ సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నామని రైతులు తెలియజేయగా, ఏర్పాటుకు అనువైన స్థలాన్ని ఎంపిక చేసి ప్రతిపాదనలను పంపాల్సిందిగా ఆర్డీఓ పావనిని ఆదేశించారు. గ్రామంలో శ్మశాన వాటిక.. సంగంలో బస్టాండ్ ఏర్పాటు తదితరాలను చేపట్టనున్నామని వెల్లడించారు. గ్రామంలో జరుగుతున్న వీబీ – జీరామ్‌జీ పనులను పరిశీలించి కూలీలతో మాట్లాడారు. అనంతరం చెత్తతో సంపద తయారీ కేంద్రాన్ని పరిశీలించారు. గ్రామంలోని చిక్కుడు తోటలు.. అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించారు. తహసీల్దార్ సారంగపాణి, ఎంపీడీఓ షాలెట్, సీడీపీఓ సునీలత తదితరులు పాల్గొన్నారు.


