● ఉద్యోగాల కోసం పోరాటాలు తప్పవు
● డీవైఎఫ్‌ఐ ఆలిండియా ఉపాధ్యక్షుడు
జాక్ సి.థామస్
నెల్లూరు(వీఆర్సీసెంటర్): ‘ఎన్నికల సమయంలో అనేక హామీలిచ్చి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. వాటిని నెరవేర్చలేక రూ.లక్షల కోట్లు అప్పులు చేసి రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టేస్తోంది’ అని డీవైఎఫ్‌ఐ నాయకులు ఆరోపించారు. నెల్లూరు నగరంలో మూడురోజులపాటు జరిగే డీవైఎఫ్‌ఐ 16వ రాష్ట్ర మహాసభలు మంగళవారం ప్రారంభమయ్యాయి. వీఆర్సీౖ మెదానం నుంచి నర్తకీ సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసి బహిరంగ సభలో డీవైఎఫ్‌ఐ ఆలిండియా ఉపాధ్యక్షుడు జాక్ సి.థామస్ మాట్లాడారు. దేశంలో పోరాటాలు చేస్తున్న యువతకు డీవైఎఫ్‌ఐ అండగా నిలుస్తుందన్నారు. సాధారణ ప్రజలు, రైతులు, యువత, విద్యార్థులను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేస్తోందని ఆరోపించారు. దేశంలో ఒక సంవత్సరంలో 750 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారన్నారు. ప్రధాని మోదీ 13 ఏళ్ల పాలనలో ఆకలిచావులు, నిరుద్యోగం, నీట్ పేపర్ లీక్‌లు, కార్పొరేట్ సంస్థలకు ప్రభుత్వ సంపదను దోచిపెట్టడం తప్ప చేసిందేమీ లేదని ఆరోపించారు. దేశంలోని ప్రభుత్వ శాఖల్లో 8 లక్షలు, రాష్ట్రంలో 2.14 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయన్నారు. అదేవిధంగా రాష్ట్రంలో పోలీస్ శాఖలో ఖాళీగా ఉన్న 11,639 పోస్టులను వెంటనే భర్తీల చేయాలని డిమాండ్ చేశారు. పరిశ్రమల్లో స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు క ల్పించాలన్నారు. రాజకీయ జవాబుదారీతనంపై యువత ప్రశ్నించాలని కోరారు. నేడు రాష్ట్రంలో రాజకీయ నాయకులు, ప్రభుత్వ ఉద్యోగులు అంతులేని అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. గంజాయిని అరికట్టడంతో కూటమి నాయకులు విఫలమయ్యారన్నారు. కార్యక్రమంలో డీవైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు రామన్న, రాము, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రమణ, నరసింహ, రాజు, శివ, బాబు, రమేష్, నగేష్ తదితరులు పాల్గొన్నారు.


