సీతారామపురం: మండలంలోని బసినేనిపల్లిలోని వెంకటదుర్గా ఫిల్లింగ్ స్టేషన్ పెట్రోల్ బంక్‌లో రూ.60 వేల నగదు చోరీకి గురైన ఘటన మంగళవారం వెలుగు చూసింది. బంక్ యజమాని కథనం మేరకు.. సోమవారం వేకువజామున 3:30 గంటల ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తి స్కూటీపై పెట్రోల్ బంక్‌కు వచ్చాడు. అక్కడ వాచ్‌మెన్, పంప్ బాయ్ నిద్రపోతున్నారు. అతను పరిసరాలను గమనించాడు. ఆఫీస్ గది తాళం చెవి తలుపుకే ఉండటంతో లోపలికి ప్రవేశించి డెస్కులో ఉన్న రూ.60 వేల నగదును అపహరించాడు. అనంతరం తలుపు వేసి, తాళం చెవిని యథావిధిగా అక్కడే ఉంచి స్కూటీపై సీతారామపురం మార్గంలో వెళ్లిపోయాడు. ఉదయం 6 గంటలకు నిద్రలేచిన సిబ్బందికి నగదు కనిపించకపోవడంతో సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించారు. చోరీ జరిగినట్లు నిర్ధారించుకుని యజమానికి సమాచారం అందించారు. దీంతో ఆయన సీసీ ఫుటేజీలో నమోదైన దొంగ ఫొటో ఆధారంగా పరిసర ప్రాంతాల్లో గాలించినా ఆచూకీ లభించలేదు. అదేరోజు మార్కాపురం జిల్లా కొత్తపల్లి టోల్‌ప్లాజాను నిందితుడు దాటినట్లు సీసీ కెమెరాల్లో నమోదైంది. యజమాని సురేష్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
రెడ్‌క్రాస్ సొసైటీకి
అరుదైన గుర్తింపు
నెల్లూరురూరల్: ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ నెల్లూరు జిల్లా శాఖ అందిస్తున్న విశేష సేవలకు అరుదైన గుర్తింపు లభించింది. కలెక్టర్ హిమాన్షు శుక్లాకు గవర్నర్ గోల్డ్ మెడల్ లభించింది. మంగళవారం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ ఆంధ్రప్రదేశ్ శాఖ వార్షిక సర్వసభ్య సమావేశం జరిగింది. ఇందులో రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా కలెక్టర్ అవార్డును స్వీకరించారు. ఐఆర్‌సీఎస్ సేవా కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించడంతోపాటు రక్తదాన కార్యక్రమాల విస్తరణ, లైఫ్ మెంబర్ల నమోదులో సాధించిన ప్రగతిని గుర్తిస్తూ ఈ గౌరవం దక్కింది.
15,747 యూనిట్ల రక్తం సేకరణ
జిల్లా ఐఆర్‌సీఎస్ శాఖలో ఇప్పటి వరకు 2,097 మంది లైఫ్ మెంబర్లు నమోదు చేసుకున్నారు. వివిధ రక్తదాన శిబిరాల ద్వారా 15,747 యూనిట్ల రక్తాన్ని సేకరించి, అత్యవసర పరిస్థితుల్లో అవసరమైన వారికి అందుబాటులో ఉంచడంలో జిల్లా శాఖ కీలకపాత్ర పోషించింది. గోల్డ్‌మెడల్ దక్కడంపై అధికారులు, ఐఆర్‌సీఎస్ సభ్యులు, వలంటీర్లు హర్షం వ్యక్తం చేశారు.
నిమ్మ ధరలు (కిలో)
పెద్దవి : రూ.150
సన్నవి : రూ.85
పండ్లు : రూ.40


