● బస్తా కాయలు రూ.16 వేలు
పొదలకూరు: నిమ్మకాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. బస్తా కాయల ధర రూ.16 వేలు పలుకుతోంది. మార్కెట్లో అధిక ధరలున్నా, కాపు లేకపోవడంతో రైతులకు వింత పరిస్థితి ఎదురైంది. దీంతో కర్షకులతో నిత్యం కళకళలాడే పొదలకూరు నిమ్మ మార్కెట్ వెలవెలబోతోంది. పొదలకూరు మార్కెట్ పరిధిలోని నాలుగైదు మండలాల్లో చెట్లకు కాయల్లేకపోవడంతో నిమ్మకాయలకు అనూహ్యమైన డిమాండ్ ఏర్పడింది. గత మంగళవారం 80 కిలోల బస్తా ధర సుమారు రూ.12 వేల వరకు పలకగా, ప్రస్తుతం రూ.16 వేల వరకు చేరుకుంది. కాయల నాణ్యత, పరిమాణాన్ని బట్టి బస్తా రూ.14 వేల నుంచి రూ.16 వేల వరకు పలుకుతోందని మార్కెట్ వ్యాపారులు వెల్లడించారు.
జెడ్పీ స్థాయీ సంఘ
సమావేశాలు రేపు
నెల్లూరు(పొగతోట): జెడ్పీ స్థాయీ సంఘ సమావేశాలను జెడ్పీ కార్యాలయంలో గురువారం ఉదయం 10.30 నుంచి సాయంత్రం ఐదు వరకు నిర్వహించనున్నామని సీఈఓ వసుమతి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. చైర్‌పర్సన్ ఆనం అరుణమ్మ అధ్యక్షతన నిర్వహించనున్న సమావేశాలకు ఆయా శాఖల జిల్లా అధికారులు, జెడ్పీ సభ్యులు హాజరుకావాలని కోరారు.
93 శాతం మందికి
పింఛన్ల పంపిణీ
నెల్లూరు(పొగతోట): సామాజిక పింఛన్ల పంపిణీ ప్రక్రియ జిల్లా వ్యాప్తంగా ప్రారంభమైంది. 93 శాతం మంది లబ్ధిదారులకు నగదును మంగళవారం అందజేశారు. 2,85,316 మందికి గానూ 2,65,344 మందికి పంపిణీ చేశారు. రానున్న రెండు రోజుల్లో మిగిలిన వారికి అందజేయనున్నామని డీఆర్డీఏ పీడీ నాగరాజకుమారి తెలిపారు.
శ్రామికుల సంఖ్యను
పెంచండి
నెల్లూరు(పొగతోట): వీబీ జీరామ్ జీ ద్వారా పనులకు హాజరయ్యే శ్రామికుల సంఖ్యను పెంచాలని డ్వామా పీడీ శ్రీనివాసప్రసాద్ ఆదేశించారు. నగరంలోని డ్వామా కార్యాలయం నుంచి వివిధ మండలాల ఏపీఓలు, ఈసీలు, టీఏలతో మంగళవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లో పనులను గుర్తించి.. శ్రామికులతో చేయించి వారికి ఉపాధిని కల్పించాలని సూచించారు. కూలీలకు 15 రోజులకోసారి పేమెంట్లను వారి బ్యాంక్ ఖాతాల్లో జమచేయనున్నారని వెల్లడించారు. జాప్యం జరిగితే వడ్డీతో సహా వేయనున్నారని తెలిపారు. హార్టికల్చర్ ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు.
ఎస్పీడీసీఎల్ ఎస్‌ఈ
బాధ్యతల స్వీకరణ
నెల్లూరు(వీఆర్సీసెంటర్): ఎస్పీడీసీఎల్ జిల్లా సర్కిల్ ఎస్‌ఈగా బాధ్యతలను సుధాకర్ నగరంలోని విద్యుత్ భవన్‌లో మంగళవారం స్వీకరించారు. ఇప్పటి వరకు ఎస్‌ఈగా ఉన్న రాఘవేంద్రం ఉద్యోగ విరమణ పొందారు. ఈ తరుణంలో విద్యుత్ విజిలెన్స్ విభాగంలో ఈఈగా పనిచేస్తున్న సుధాకర్‌ను ఉద్యోగోన్నతిపై ఇక్కడ నియమిస్తూ ఉత్తర్వులను సీఎండీ శివశంకర్ జారీ చేశారు. ఈ సందర్భంగా సుధాకర్ మాట్లాడారు. నాణ్యమైన విద్యుత్‌ను అందించేలా కృషి చేస్తానని చెప్పారు. కాగా ఆయనకు శుభాకాంక్షలను పలువురు తెలియజేశారు.
డీపీఓగా..
నెల్లూరు(పొగతోట): జిల్లా పంచాయతీ అధికారిగా బాధ్యతలను వెంకటరామన్ స్వీకరించారు. నరసాపురం డీడీఓగా విధులు నిర్వర్తిస్తున్న ఈయన్ను డీపీఓగా నియమిస్తూ ఉత్తర్వులను అధికారులు జారీ చేసిన విషయం విదితమే.


