● ఆలస్యంగా వెలుగులోకి
నెల్లూరు (క్రైమ్): కన్సల్టెన్సీ పేరుతో రూ.6.32 కోట్లు మోసగించిన వారిపై చర్యలు తీసుకోవాలని నెల్లూరు సరస్వతీనగర్‌కు చెందిన పి.అనూష ఎస్పీ అజిత వేజెండ్లకు ఫిర్యాదు చేసిన విషయం మంగళవారం వెలుగులోకి వచ్చింది. బాధితురాలి ఫిర్యాదులోని వివరాల మేరకు.. నెల్లూరుకు చెందిన అవినాష్ మరి కొందరు కలిసి కన్సల్టెన్సీ కార్యాలయం నిర్వహిస్తున్నారని, విదేశాల్లో ఎంబీబీఎస్ సీట్లు, నారాయణ కళాశాలలో సీట్లు ఇప్పిస్తామని, డాలర్లు తక్కువ ధరకే ఇప్పిస్తామని, దుబాయి నుంచి తక్కువ ధరకే బంగారు నాణేలు తెప్పిస్తామని నమ్మించి తన భర్త, తన స్నేహితుల బ్యాంకు ఖాతాల నుంచి వివిధ ఖాతాలకు రూ. 6,32,71,497 నగదు బదిలీ చేయించుకుని మోసగించారని అనూష ఫిర్యాదులో పేర్కొన్నారు. డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరగా మారణాయుధాలతో బెదిరించరాని, పోలీసులకు ఫిర్యాదు చేస్తే తన కుమార్తెను చంపేస్తామని హెచ్చరించారని ఆరోపించారు. తనను మోసగించిన వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకోవడంతోపాటు తనకు, తన కుటుంబానికి రక్షణ కల్పించాలని ఆమె ఎస్పీని కోరారు. స్పందించిన ఎస్పీ విచారణకు ఆదేశించినట్లు తెలిసింది.
శ్రీవారి దర్శనానికి
12 గంటలు
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ మంగళవారం ఎక్కువగా ఉంది. క్యూ కాంప్లెక్స్ లోని 29 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. స్వామివారిని 77,042 మంది సోమవారం అర్ధరాత్రి వరకు దర్శించుకున్నారు. తలనీలాలను 36,698 మంది అర్పించారు. కానుకల రూపంలో హుండీలో రూ.4.14 కోట్లను సమర్పించారు. టైమ్ స్లాట్ టికెట్లున్న వారికి సకాలంలో దర్శనం లభిస్తోంది. ఇవి లేని వారికి 12 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక టికెట్లు గల వారు మూడు గంటల్లోనే దర్శించుకోగలుగుతున్నారు. కాగా సర్వదర్శన టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. సమయానికంటే ముందెళ్లిన వారిని క్యూలోకి అనుమతించరని స్పష్టం చేసింది.


