మైనింగ్‌పై చైనా పెత్తనం | - | Sakshi
Sakshi News home page

మైనింగ్‌పై చైనా పెత్తనం

Aug 31 2026 12:02 AM | Updated on Aug 31 2026 12:02 AM

నెల్లూరు రూరల్‌: రాష్ట్రంలో మైనింగ్‌ వ్యవస్థను చైనా జాతీయుడు శాసిస్తున్నారని, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అండదండలతోనే మైనింగ్‌ సిండికేట్‌ దందా కొనసాగుతోందని మాజీ మంత్రి, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పీఏసీ సభ్యుడు అనిల్‌కుమార్‌యాదవ్‌ ఆరోపించారు. నగరంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరులతో ఆదివారం ఆయన మాట్లాడారు. మల్టీ ఎలిమెంట్‌ కంపెనీకి చెందిన డౌ అనే చైనా జాతీయుడు స్థానిక మైనింగ్‌ సిండికేట్‌ను తన గుప్పెట్లో పెట్టుకొని గనుల యజమానులను బెదిరిస్తున్నారని ఆరోపించారు. తమ కంపెనీకే క్వార్ట్‌జ్‌ మెటీరియల్‌ను ఇవ్వాలని, లేని పక్షంలో అధికారుల ద్వారా గనులను బ్లాక్‌ చేయిస్తానంటూ బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. డౌతో వీపీఆర్‌కు ఉన్న సంబంధంపై ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.

రూ.55 కోట్ల ఆదాయం.. రూ.11.99 కోట్లకు

క్వార్ట్‌జ్‌ మైనింగ్‌ ద్వారా తమ హయాంలో ప్రభుత్వానికి రూ.55 కోట్ల ఆదాయమొచ్చిందని, అయితే ప్రస్తుతం ఇది రూ.11.99 కోట్లకు పడిపోయిందని చెప్పారు. ఆర్టీఐ ద్వారా తన వద్దకొచ్చిన సమాచారంతోనే ఈ అంశాలను వెల్లడిస్తున్నానని స్పష్టం చేశారు. చైనాలో క్వార్ట్‌జ్‌ డిమాండ్‌తో ఎగుమతులు ఆగిపోలేదని, సిండికేట్‌ దోపిడీ కారణంగానే మైనింగ్‌ రంగం కుదేలైందని విమర్శించారు. లీగల్‌గా మైనింగ్‌ చేస్తున్న గనుల యజమానుల నుంచి టన్నుకు రూ.ఎనిమిది వేల నుంచి రూ.15 వేల వరకు సిండికేట్‌ అక్రమంగా వసూలు చేస్తోందని ఆరోపించారు. ఈ రకంగా గత రెండేళ్లలో రూ.200 కోట్లకుపైగా అక్రమంగా కొల్లగొట్టారని మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా 147 క్వార్ట్‌జ్‌ లీజులుండగా, 98 గనులనే తెరిచారని, సిండికేట్‌కు కప్పం కట్టలేదనే కారణంతో మిగిలిన వాటిని మూయించారని ధ్వజమెత్తారు. ఫలితంగా వేలాది మంది కార్మికులు ఉపాధి కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు.

శాసించే స్థాయికెలా వచ్చారు..?

రాష్ట్రంలో మైనింగ్‌ వ్యవస్థను శాసించే స్థాయికి మల్టీ ఎలిమెంట్‌ కంపెనీకి చెందిన డౌ అనే చైనా జాతీయుడు ఎలా వచ్చారని ప్రశ్నించారు. ఇది తీవ్రమైన అంశమని, దేశ భద్రతకు సంబంధించిన అనేక ప్రశ్నలను లేవనెత్తుతోందని తెలిపారు. వీపీఆర్‌ అండదండలతోనే సిండికేట్‌ నడుస్తోందని.. డౌ చెప్తున్నట్లే మైన్‌ ఓనర్లు వ్యవహరిస్తున్నారని, దీనిపై ఎంపీ సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఫినీ క్వార్ట్‌జ్‌ పేరుతో విజయ్‌కుమార్‌రెడ్డి అనే వ్యక్తి ఆధ్వర్యంలో సిండికేట్‌ కార్యకలాపాలు సాగుతున్నాయని మండిపడ్డారు. ఈ దందాలతో ఒక్కో మండలంలో సుమారు మూడు వేల మంది వరకు కార్మికులు ఉపాధి కోల్పోయారని తెలిపారు. మైనింగ్‌ కోసం జేసీబీలు, వాహనాలను కొనుగోలు చేసిన వారు ఈఎంఐలను చెల్లించలేక ఆర్థికంగా నష్టపోయారని చెప్పారు. దేవదాయ శాఖకు సంబంధించిన భూముల్లోనూ పల్స్‌ఫర్‌ అక్రమ మైనింగ్‌ జరుగుతోందని ఆరోపించారు. పురాతన సిద్ధలయ్యకోన ప్రాంతంలో అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. దీనిపై విచారణ జరపాలని దేవాదాయ శాఖ మంత్రికి లేఖ రాసినా, స్పందించడంలేదని విమర్శించారు. తమ ప్రభుత్వ హయాంలో నాలుగు లక్షల టన్నుల పల్స్‌ఫర్‌ మైనింగ్‌ జరిగితే, ప్రస్తుతం ఇది 1.48 లక్షల టన్నులకు పడిపోయిందన్నారు. చిన్న స్థాయిలో వ్యాపారం చేసుకునే సుమారు 352 ఎమ్డీఎల్‌లను ఎందుకు బ్లాక్‌ చేశారని ప్రశ్నించారు.

ఎంపీ వేమిరెడ్డి

కనుసన్నల్లోనే

సిండికేట్‌ దోపిడీ

టన్నుకు రూ.ఎనిమిది వేల నుంచి రూ.15 వేల వరకు అక్రమ వసూళ్లు

మాజీ మంత్రి

అనిల్‌కుమార్‌యాదవ్‌

దమ్ముంటే సీబీఐ

విచారణకు ఆదేశించండి

తాను చేస్తున్న ఆరోపణలు తప్పని తేలితే సీబీఐ విచారణకు ఆదేశించాలని సవాల్‌ విసిరారు. చైనా జాతీయుడి వ్యవహారంపై కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖకు ఫిర్యాదు చేయనున్నానని వెల్లడించారు. మైనింగ్‌ దందాలను ఆపకపోతే తన వద్ద ఉన్న వాట్సాప్‌ చాట్‌లు, చైనా పర్యటనకు సంబంధించిన ఫొటోలు, వాయిస్‌ రికార్డింగ్‌లను బయటపెడతానని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement